స్వాతంత్ర్యం వచ్చి అక్టోబర్ 1కి 70 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా భారీ ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది చైనా. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతం చేశారు హాంకాంగ్ నిరసనకారులు. హాంకాంగ్‌లో భారీ ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల పోలీసులకు, ఆందోళనకారులకు ఘర్షణలు చెలరేగి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
చైనా 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లకు కొంతమంది నిరసనకారులు నిప్పంటించారు. సబ్వే స్టేషన్లను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిరసనకారులపై భాష్పవాయువు, జల ఫిరంగులు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు.
ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు..
చైనా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలను చేపట్టాలని సామాజిక మాధ్యమాల వేదికగా హాంకాంగ్ ప్రజాస్వామ్య మద్దతుదారులు కోరారు. వీరి పిలుపు మేరకు ఆస్ట్రేలియా, తైవాన్, అమెరికా, యూరప్‌లోని 40 ముఖ్య నగరాల్లో ర్యాలీలు చేపట్టారు ప్రజలు.
ఆస్ట్రేలియా ప్రజలు నల్లని దుస్తులు ధరించి 'హాంగ్‌కాంగ్ వాసులకు మద్దతు' అని నినాదాలు చేశారు. 'నిరంకుశ పాలన నుంచి హాంగ్‌కాంగ్‌ను కాపాడండి' అంటూ సిడ్నీ నగరంలో పసుపు రంగు గొడుగులు, ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.