గూగుల్.. ఏ సమాచారం కావాలన్నా నిమిషాల్లో మన ముందు ఉంచుతుంది. అయితే కొన్నిసార్లు ఇందులో తలెత్తిన లోపాలు దిగ్గజ సంస్థకు తలనొప్పులు తెచ్చిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా హాంగ్‌కాంగ్‌లో వెల్లువెత్తుతోన్న ప్రజా నిరసనలకు గూగుల్ లోపం ఆజ్యం పోసింది.
'ఐ ఏమ్ సాడ్ టు సీ హాంగ్‌కాంగ్ బికమ్ పార్ట్ ఆఫ్ చైనా' (హాంగ్‌కాంగ్... చైనాలో భాగం కావడాన్ని చూసేందుకు నేను చింతిస్తున్నా) అనే వాక్యాన్ని చైనీస్‌లోకి గూగుల్ అనువాదం చేశారు కొందరు నెటిజన్లు. అయితే ఆశ్చర్యంగా 'సాడ్'(బాధ) స్థానంలో 'హ్యాపీ'(ఆనందం) అనే అర్థాన్ని ఇస్తూ గూగుల్ అనువాదం చేసింది. ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు షాక్ అయ్యారు. క్షణాల్లో ఇది వైరల్ అయింది.
ఈ విషయంపై స్పందించిన గూగుల్ సిబ్బంది ఒకరు సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. సాధారణంగా కష్టమైన అల్గారిథమ్స్, కంప్యూటర్ లాంగ్వేజస్, అనువాదాలను చిటికెలో చేస్తోంది గూగుల్. అయితే ఈ సమస్య ఎక్కడ తలెత్తిందో తెలియక తర్జనభర్జనలు పడింది సంస్థ యాజమాన్యం. ఎట్టకేలకు ఒక గంట తర్వాత సరైన అనువాదం వచ్చింది.
నేరాలకు పాల్పడ్డ తమ దేశస్తులను విచారణ నిమిత్తం అవసరమైతే చైనాకు అప్పగించేందుకు వీలుగా హాంగ్‌కాంగ్ ప్రభుత్వం చట్టం తీసుకురావాలని యోచిస్తోంది. ఈ వివాదాస్పద బిల్లుపై ప్రజాగ్రహం పెల్లుబికింది. గత వారం రోజులుగా నిరసనలు మిన్నంటుతున్నాయి.
- ఇదీ చూడండి: ట్రంప్ 'విదేశీ' వ్యాఖ్యలు- ప్రతిపక్షం చురకలు