ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భయాలతో విమానప్రయాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. ప్రయాణికులు లేక విమానాశ్రయాలు వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది హాంకాంగ్ ఎయిర్‌లైన్స్. 400 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థలోని 27వేలమంది కార్మికులు మూడువారాల పాటు సెలవు తీసుకోవాలని.. అయితే ఇందుకు ఎలాంటి వేతనాలు చెల్లించబోమని స్పష్టం చేసింది. ప్రయాణికుల నుంచి డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణంగా వెల్లడించింది. మార్చి నుంచి జూన్ మధ్య ఎప్పుడైనా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఈనెల 17నుంచి వారానికి మూడురోజులు మాత్రమే పనిచేయాలని స్పష్టం చేసింది.
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెంకేందుకే...
పర్యటక రంగం ప్రధాన ఆర్థిక వనరు అయిన హాంకాంగ్‌కు కరోనా కారణంగా ప్రపంచదేశాలు రాకపోకలు నిలిపేశాయి. ఈ కారణంగా ఆర్థిక వ్యవస్థ, పర్యటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే కొన్ని నెలల నుంచి ఆందోళనతో కుంగిపోయిన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజితం అవుతున్న తరుణంలో కరోనా ప్రభావం హాంకాంగ్‌ను ముంచెత్తింది. ప్రయాణికులు లేక కునారిల్లుతున్న విమానయాన సంస్థను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ప్రకటించింది.
"ఇలాంటి గడ్డు పరిస్థితులు గతంలో ఎన్నడూలేవు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వైరస్ ప్రభావం నేపథ్యంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం విమానప్రయాణాలకు నెలకొన్న అతిస్వల్ప డిమాండ్ వేసవిలోనూ కొనసాగే అవకాశం కన్పిస్తోంది. ఈ పరిస్థితి నుంచి కోలుకునేందుకు తదుపరి చర్యలు తీసుకుంటాం."
- హాంకాంగ్ విమానయాన సంస్థ
హాంకాంగ్‌లో ఇప్పటివరకు 24 మంది కరోనా బారినపడగా, ఒకరు మృతిచెందారు.
ఇదీ చూడండి: ఈ రైతును తేనెటీగలు కుట్టవు.. ఎందుకో తెలుసా?