ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో హాంకాంగ్, బీజింగ్ మద్దతుదారులు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు. నేరస్థులను చైనాకు అప్పగించే బిల్లుపై హాంకాంగ్‌లో జరుగుతున్న నిరసనలకు మద్దతుగా లండన్‌లో కొందరు ఆందోళనలు చేశారు. వీటికి ప్రతిగా చైనా మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహించారు.
బ్రిటన్.. హాంకాంగ్‌కు మద్దతుగా నిలవాలంటూ నిరసనకారులు ప్రదర్శన చేపట్టారు. 'హాంకాంగ్‌కు మద్దతుగా నిలవండి', 'బ్రిటన్ ప్రధాని బోరిస్ చైనాకు లోంగిపోతారా?' అంటూ నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. హాంకాంగ్‌ను చైనా కబంధహస్తాలకు అప్పగించొద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బ్రిటీష్ వలస కాలంలోని హాంకాంగ్ జెండాను నిరసనకారులు ఎగురవేశారు.
చైనా మద్దతుదారుల పోటీ ప్రదర్శన
హాంకాంగ్ ప్రదర్శనకారులకు వ్యతిరేకంగా చైనా మద్దతుదారులు నిరసన చేపట్టారు. హాంకాంగ్ నిరసనకారులను 'దేశ ద్రోహులు అంటూ నిందించారు. 'ఒక దేశం-ఒక చైనా', 'హాంకాంగ్ ఎప్పటికీ చైనాలో భాగమే' అంటూ నినాదాలు చేశారు.
పారిస్... పసుపు చొక్కా ఉద్యమకారుల మద్దతు
ఫ్రాన్స్‌లోని కొందరు 'పసుపు చొక్కాల నిరసనకారులు'.... హాంకాంగ్ ప్రజాస్వామ్యవాదులకు మద్దతు ప్రకటించారు.
సెమీ అటానమస్ స్టేట్
చైనాతో కుదుర్చుకున్న జాయింట్ డిక్లరేషన్ ఆధారంగా 1997లో బ్రిటన్... హాంకాంగ్ నియంత్రణను డ్రాగన్‌కు అప్పగించింది. ఈ డిక్లరేషన్ ప్రకారం 2047 వరకు ఇది సెమీ అటానమస్ నగరంగా ఉంటుంది. ఆ తరువాత పూర్తి స్వేచ్ఛ పొందుతుంది.
నిరసనలు తీవ్రరూపం..
హాంకాంగ్‌లో పదివారాలుగా కొనసాగుతున్న ప్రజా స్వామ్యవాదుల నిరసన... ఇప్పుడు మరింత ఉద్ధృతంగా మారుతోంది. శనివారం వేలాది మంది నిరసనకారులు.. వీధుల్లోకి వచ్చి హక్కుల కోసం గళమెత్తారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలని, నేరస్థులను చైనాకు అప్పగించే బిల్లును శాశ్వతంగా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లూమ్ రాజీనామా చేయాలని నినదించారు.
ఇదీ చూడండి: మధురై మీనాక్షి పట్టాభిషేకంలో మహాత్ముడు!