ప్రపంచదేశాలను కరోనా వైరస్ భయపెడుతూనే ఉంది. వైరస్ లక్షణాలతో ప్రపంచవ్యాప్తంగా లక్షా 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 100 దేశాలకు కరోనా విస్తరించింది. 3వేల 800కుపైగా మందిని బలితీసుకుంది.
ఇరాన్లో...
ఇరాన్వాసులను కరోనా తీవ్రంగా కలవరపెడుతోంది. తాజాగా మరో 43మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మృతుల సంఖ్య 237కు చేరింది. 595 కొత్త కేసులతో సహా మొత్తం 7,167మందికి కోవిడ్-19 సోకినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు దాదాపు 2,394 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు తెలిపింది.
విమానాలు రద్దు..
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ సహా 13 దేశాలకు రాకపోకలను నిలిపివేసింది ఖతార్ విమానయాన సంస్థ. ఇందులో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న చైనా, ఇటలీ, ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, నేపాల్, పాకిస్థాన్, ఫిలిప్పిన్స్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ దేశాలున్నాయి.
అయితే భారత ప్రయాణికులు రాజధాని దోహా విమానాశ్రయం కేంద్రంగా కనెక్టింగ్ ఫ్లైట్లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది ఖతార్. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి పూర్తి డబ్బును తిరిగి చెల్లించేస్తామని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఇండిగో.. మార్చ్ 17 వరకు ఖతార్‌కు విమానాలు రద్దు చేసింది. గోఎయిర్, ఎయిర్ ఇండియా సంస్థలు సైతం సేవలను నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి:ప్రభుత్వ నిఘా నడుమ ఘనంగా 'అట్టుకల్' వేడుకలు