భారత్ నిరసనల మధ్య పాకిస్థాన్ ఆక్రమిత భూభాగమైన గిల్గిత్- బాల్టిస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ.. ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఈ ప్రాంతంలో ఎన్నికలు జరపాలన్న పాక్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది భారత్. కశ్మీర్ భూభాగంలో దాయాది దేశం చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ.. తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది.
కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఎలాంటి అంతరాయం కలుగకుండా సాగింది ఈ పోలింగ్. ఓట్ల లెక్కింపు ప్రాంభమవ్వగా.. సోమవారం ఫలితాలు వెలువడనున్నాయి.
23 స్థానాల్లో 330 మంది పోటీ..
2010లో రాజకీయ సంస్కరణల అనంతరం.. ఆ ప్రాంతంలో మూడోసారి శాసనసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 24 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 23 స్థానాల్లో మాత్రమే పోలింగ్ నిర్వహించారు అధికారులు. ఇందులో నలుగురు మహిళలు సహా.. మొత్తం 330 మంది అభ్యర్థులు పోటీ చేసినట్టు సమాచారం. మొత్తం 1,141 పోలింగ్ కేంద్రాల్లో 15వేల మంది భద్రతా సిబ్బంది మోహరించారు.
ఇదీ చదవండి: గిల్గిత్-బాల్టిస్థాన్కు రాష్ట్ర హోదా ప్రకటించిన పాక్!