రష్యాలో కరోనా డెల్టా వేరియంట్ విజృంభణ కొనసాగుతున్న వేళ కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తొలుత బ్రెజిల్‌లో వెలుగు చూసిన గామా వేరియంట్ ఇప్పుడు రష్యాకు పాకినట్టు తెలుస్తోంది. రష్యాలో కొన్ని గామా వేరియంట్ కేసులు గుర్తించినట్టు ఎపివాక్ కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థ పేర్కొన్నట్టు ఇంటర్‌ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
అయితే, రష్యాలో కొవిడ్ కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్, వ్యాక్సినేషన్ మందగించడమే కారణమని అక్కడి అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు, గురువారం ఒక్కరోజే రష్యాలో 24,471 కొత్త కేసులు, 796 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆ దేశంలో రిజిస్టర్ అయిన నాలుగు టీకాల్లో ఎపివాక్ కరోనా వ్యాక్సిన్ రెండోది కాగా.. దీన్ని సెర్బియాలో వెక్టార్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. అలాగే, స్పుత్నిక్-వి టీకాని రష్యా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. డెల్టా, గామా వేరింట్లు వేగంగా, సులువుగా వ్యాప్తి చెందడంతో పాటు యాంటీబాడీల ప్రభావాన్ని తగ్గించే లక్షణం కలిగి ఉండటంతో వీటిని ఆందోళనకరమైన కేటగిరీలుగా వర్గీకరించినట్టు ఆ సంస్థ పేర్కొంది.
ఇవీ చదవండి:విజృంభిస్తున్న 'డెల్టా' వైరస్- డబ్ల్యూహెచ్ఓ ఆందోళన