జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న చైనా.. రాష్ట్ర పునర్విభజన నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయటం చట్టవిరుద్ధమని, అది చెల్లుబాటు కాదని ఆరోపించింది. చైనాలోని కొంత భూభాగాన్ని భారత్ పరిపాలనలోకి చేర్చటం ద్వారా తమ దేశ సార్వభౌమత్వాన్ని భారత్ సవాల్ చేసిందని పేర్కొంది.
ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు చేసి.. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే రోజు పార్లమెంట్ ఆమోదం పొందింది. నేటి నుంచి ఆ చట్టం అధికారింగా అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో చైనా తన అక్కసు వెల్లగక్కింది.
"జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల స్థాపనను భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇందులో చైనాకు చెందిన కొంత భూభాగాలను భారత్ పరిపాలన పరిధిలో చేర్చారు. చైనా దానిని ఖండిస్తోంది. గట్టిగా వ్యతిరేకిస్తోంది. చైనా సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తూ.. భారత్ తన దేశీయ చట్టాలను, పరిపాలన విభాగాన్ని ఏకపక్షంగా మార్చింది."
- జెంగ్ షువాంగ్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.
చైనా ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని హృదయపూర్వకంగా గౌరవించాలని కోరారు జెంగ్. ఇరు దేశాల మధ్య ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కాపాడాలని సూచించారు.
భారత్ అంతర్భాగమే..
జమ్ముకశ్మీర్‌పై చైనా వ్యాఖ్యలను తిప్పికొట్టింది భారత్. రాష్ట్ర పునర్విభజన అంశం పూర్తిగా అంతర్గత విషయమని పునరుద్ఘాటించింది. ఇలాంటి విషయాలపై విదేశాలు మాట్లాడాల్సిన అవసరం లేదని పేర్కొంది. లద్దాఖ్, జమ్ముకశ్మీర్ ప్రాంతాల్లో భూభాగాన్ని చైనా ఆక్రమిస్తూనే ఉందని తెలిపింది.
ఇదీ చూడండి: అదిగో 'నవకశ్మీరం'.. రెండుగా మారిన 'హిమశిఖరం'