చాలాకాలంగా సైన్స్ కాల్పనిక సాహిత్యానికే పరిమితమైన 'ఎగిరే కార్లు' వాస్తవ రూపంలోకి రాబోతున్నాయి. వీటిని సాకారం చేసేందుకు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. జపాన్‌కు చెందిన ఓ సంస్థ.. తాజాగా ఒక ఫ్లయింగ్ కారును విజయవంతంగా గాల్లో నడిపింది. స్కై డ్రైవ్ అనే సంస్థ ఈ వాహనాన్ని రూపొందించింది. ఒక వ్యక్తితో దీన్ని గగనవిహారం చేయించింది.
2023 నాటికి..
నాజూకైన మోటారు సైకిల్‌లా కనిపించే ఈ వాహనం.. ప్రొపెల్లర్ల సాయంతో నేల నుంచి 1-2 మీటర్ల మేర గాల్లోకి లేచింది. నాలుగు నిమిషాల పాటు విహరించింది. 2023 నాటికి ఫ్లయింగ్ కారు వాస్తవ రూపంలోకి వస్తుందని స్కైడ్రైవ్ అధిపతి తోమోహిరో ఫుకుజావా ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే దాన్ని సురక్షితంగా తీర్చిదిద్దడం చాలా కీలకమని ఆయన అంగీకరించారు.
కార్టివేటర్ పేరిట..
ఎగిరే కారు తయారుచేయడానికి ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా ప్రాజెక్టులు సాగుతున్నాయి. అయితే చోదకుడితో సహా గాల్లోకి లేచిన వాహనాలు అతికొద్ది సంఖ్యలోనే ఉన్నాయని ఫుకుజావా పేర్కొన్నారు. ఈ తరహా కార్లను ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటీఓఎల్) వాహనాలుగా పేర్కొంటారు. ఇవి విమానాలు, హెలికాప్టర్లకు భిన్నంగా ఉంటాయి. సొంతంగా ఒక చోటు నుంచి మరో చోటుకు వేగంగా పయనించడానికి ఇవి వీలు కల్పిస్తాయి. ట్రాఫిక్ రద్దీ, విమానాశ్రయాల్లో ఎదురయ్యే ఇబ్బందులు వంటి వాటికి ఇవి విరుగుడు. 'కార్టివేటర్' పేరిట స్వచ్ఛంద ప్రాజెక్టుగా 'స్కైడ్రైవ్' ప్రారంభమైంది. ఆటోమొబైల్ దిగ్గజం టయోటా, ఎలక్ట్రానిక్స్ సంస్థ పానాసోనిక్ సహా పలు కంపెనీలు దీనికి నిధులు అందించాయి.
ఇదీ చదవండి: అక్కడ పూర్తిస్థాయిలో తెరుచుకోనున్న పాఠశాలలు