వియాత్నాం ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ తూర్పు ఆసియా దేశాల సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. వర్చువల్‌గా జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశానికి భారత్ తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించారు. వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ జువాన్ ఫ్యూక్.. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అన్ని సభ్యదేశాలూ ఇందులో పాల్గొన్నాయి.
ఈ సదస్సులో ఇండో-పసిఫిక్ గురించి ప్రస్తావించారు జైశంకర్. ఇందులో పది దేశాలు కేంద్రీకృతమై.. సముద్ర ప్రాంతంపై ఆసక్తి కనబర్చడం గురించి మాట్లాడారు. అయితే.. దక్షిణ చైనా సముద్రం పట్ల ఏకపక్ష వైఖరి ప్రదర్శించడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఈ అంశంపై చైనానుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండటం సహా.. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి అనేక దేశాలు ఇటీవల ప్రకటించిన విధానాలను స్వాగతిస్తున్నామని చెప్పారు.
సమావేశంలో భాగంగా ఉగ్రవాదం, వాతావరణ పరిస్థితులు, కరోనా మహమ్మారి వంటి సవాళ్లను అధిగమించేందుకు కొవిడ్ అనంతరం.. ప్రపంచ దేశాలకు అంతర్జాతీయ సహకారం అవసరమని జై శంకర్ అభిప్రాయపడ్డారు.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, రక్షణ సంబంధిత సమస్యలు, వాటి పరిష్కారాలు, ప్రాంతీయ ఒప్పందాల వేదికగా 2005లో తూర్ప ఆసియా శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఇందులో 10 ఆగ్నేయాసియా దేశాలతో పాటు భారత్, చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: పాకిస్థాన్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్