అఫ్గానిస్థాన్ నుంచి భారత్ చేరుకున్న అక్కడి ఎంపీ నరేందర్ సింగ్ ఖల్సా(Narender Singh Khalsa) కంటతడి పెట్టారు. 20 సంవత్సరాలుగా తాము నిర్మించుకున్నదంతా.. నాశనం అయిపోయిందంటూ ఆవేదన చెందారు. దిల్లీలో విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే.. ఆయన పలుమార్లు కన్నీరు కార్చారు.
''నాకు ఇప్పుడు ఏడుపొస్తుంది. 20 ఏళ్లలో మేం సాధించిందంతా.. ఇప్పుడు నాశనం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది శూన్యం. ఇంకేం లేదు.''
- నరేందర్ సింగ్ ఖల్సా, అఫ్గానిస్థాన్ ఎంపీ.
కాబుల్ విమానాశ్రయం నుంచి భారతీయులతో స్వదేశానికి వచ్చిన సీ-17 యుద్ధవిమానంలో.. 23 మంది అఫ్గాన్ సిక్కులు కూడా ఉన్నారు. ఇందులోనే భారత్కు చేరుకున్నారు ఖల్సా. తాలిబన్లు ఆక్రమించుకున్న అఫ్గానిస్థాన్లో (Taliban Afghanistan) ఇంకా.. 200 మందికిపైగా హిందూ సిక్కులు చిక్కుకున్నారని పేర్కొన్నారు.
తనను, తన కుటుంబాన్ని రక్షించినందుకు భారత్కు కృతజ్ఞతలు చెప్పారు. అఫ్గాన్ వీడటం బాధగా ఉన్నా.. ఇండియా తమకు రెండో మాతృదేశం లాంటిదని తెలిపారు.
తాలిబన్లు అక్కడ.. ఎంపీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఖల్సా చెప్పారు. ఇళ్లలో తనిఖీలు చేయడం సహా.. ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు.
ఇదీ చూడండి: Afghan news: తాలిబన్ చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి..