హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా ఆదివారం "సమాంతర వర్తకానికి" వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన నిరసనకారులు.. చైనా సరిహద్దు సమీపంలోని హాంకాంగ్ పోలీసు స్టేషన్‌పై పెట్రోల్ బాంబులు విసిరారు. పదుల సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
షింగ్ షుయ్ జిల్లాలో సుమారు 10 వేల మంది నిరసనకారులు శాంతియుత కవాతును నిర్విహంచారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించిన నేపథ్యంలో హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలో 42 మందిని అరెస్టు చేశారు.
సమాంతర వర్తకాన్ని వ్యతిరేకిస్తూ తాజాగా నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. రోజూ వేలాది మంది స్వదేశస్థులు శిశువులకు కావలసిన పాల పౌడర్‌ను (ఇన్ఫంట్ ఫార్ములా) చైనా నుంచి కొనుగోలు చేసేందుకు సరిహద్దులు దాటుతున్నారన్నారు. సరిహద్దు పట్టణాల్లో తరచుగా తక్కువ వస్తువులను సరఫరా చేస్తున్నారని, వస్తువుల ధరతో పాటు దుకాణాల అద్దెలనూ పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరసనకారులు.
ఆర్థిక మాంద్యానికి నిరసనలే కారణమా..?
చైనాకు నేరస్థులను అప్పగించే బిల్లును వ్యతిరేకిస్తూ చెలరేగిన ఈ ఉద్యమం ఇప్పటికీ ఏడునెలలుగా కొనసాగుతూనే ఉంది. బీజింగ్ నుంచి తమకు స్వేచ్ఛ కోరుతూ ప్రజాస్వామ్య అనుకూల నిరసనలు చేపట్టారు హాంకాంగ్ వాసులు. ఈ దశాబ్దంలో మొదటి సారి హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టడానికి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కారణమయ్యాయి.
డిమాండ్లివే
ఆందోళనకారుల డిమాండ్లకు అంగీకరించేందుకు హాంకాంగ్ ప్రభుత్వం నిరాకరించింది. సార్వత్రిక ఎన్నికలు, నిరసనకారులపై పోలీసుల చర్యలపై విచారణ, ఇప్పటివరకు అరెస్టైన 7 వేల మందిని విడుదల చేయాలని డిమాండ్లలో పేర్కొన్నారు ఆందోళనకారులు.