అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. నగరంలో జరుగుతున్న ఓ పెళ్లి వేడుకలో బాంబు పేలింది. ఈ ఘటనలో 63 మంది మృతి చెందారు. 182 మందికి తీవ్రంగా గాయపడ్డారు.
హాలులో 1200 మంది
పెళ్లికి సుమారు 1,200 మందిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వేడుక జరుగుతుండగానే అర్కెస్ట్రా స్టేజ్ సమీపంలో పేలుడు సంభవించింది. మృతుల్లో యువకులు, పిల్లలు ఎక్కువగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
"నేను వరుడి గదిలో ఉండగా భారీ శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూస్తే ఎవరినీ గుర్తుపట్టడానికి లేకుండా పోయింది. అందరూ హాలులో పడిపోయి ఉన్నారు. చాలా మంది మరణించారు. మరెంతో మంది గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం."
-అహ్మద్ ఒమిద్, వరుడి బంధువు
ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియకపోయినా... ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని అఫ్గాన్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి నుస్రత్ రాహిమి చెప్పారు.
ఈ ఏడాది రెండో పేలుడు
ఆగస్టు 14న కాబుల్‌లో తాలిబన్లు జరిపిన కారు బాంబు దాడి తర్వాత ఇది రెండో పేలుడు. ఆ దాడిలో 14 మంది మరణించగా 145 మంది గాయపడ్డారు.
కొన్నేళ్లుగా కాబుల్ లక్ష్యంగా తాలిబన్లు, ఇతర ఉగ్రవాద సంస్థలు రెచ్చిపోతున్నాయి. గతేడాది జరిగిన దాడుల్లో సుమారు 3,800 మంది మరణించారు. ఇందులో 900 మంది చిన్నారులే.
ఇదీ చూడండి: ఇండోనేసియాలో పడవ ప్రమాదం.. ఏడుగురు మృతి