చైనా.. ప్రపంచదేశాలను శాసించే స్థాయికి ఎదగాలన్న దుర్భుద్దితో రగిలిపోతోంది. ఇందుకోసం పక్కదేశాలపై దాడులకు తెగబడటం, చిన్న దేశాలకు స్తోమతకు మించి రుణాలు ఇచ్చి ఆస్తులు స్వాధీనం చేసుకోడానికి ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. అలాంటి దేశానికి అధ్యక్షుడు షీ జిన్ పింగ్. ప్రస్తుతం భారత్‌తో ఘర్షణల వెనుక ప్రధాన వ్యూహకర్త ఈయనే అన్నది నిపుణుల అభిప్రాయం. ఏ దేశాన్ని అయినా ఆర్థికంగా, సామాజికంగా విచ్ఛిన్నం చేయగల శక్తి జిన్‌పింగ్ సొంతం. అయితే అంతటి శక్తిమంతుడికీ ప్రతి మనిషిలాగే ఓ బలహీనత ఉంది. అదే 'విన్నీ... ద పూహ్'
జిన్‌పింగ్‌కు కోపం, చిరాకు తెప్పించే 'విన్నీ' మనిషి కాదు. ఓ కార్టూన్ క్యారెక్టర్. ఎంతో బలగం, మందీ మార్బలం ఉన్న జిన్‌పింగ్‌కు ఓ కార్టూన్ బొమ్మ అంటే భయమా? అని మీ సందేహమా! అయితే గతంలోకి వెళ్దాం.
![Xi Jinping fears about Winnie the Pooh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7651218_china1.jpg)
అలా నిషేధం...
అది 2013.. చైనా అధ్యక్షుడైన షీ జిన్ పింగ్.. అమెరికాలో పర్యటించారు. ఆయన అగ్రరాజ్యంలోకి రావడం నచ్చక ఎంతోమంది విమర్శలు గుప్పించారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా, సామాజిక మాధ్యమాల్లో ఆయన పర్యటన వెనుక ఏదో వ్యూహం దాగుందని, జిన్ను నమ్మొద్దని పెద్ద చర్చే నడిచింది. ఆ సమయంలో మీమ్స్ చేసేవాళ్లు ఊరుకుంటారా. జిన్‌పింగ్‌ను 'విన్నీ'తో పోల్చుతూ పెద్ద రచ్చ చేశారు. ఆనాడు జిన్ను ఆహ్వానించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామానూ ఓ 'కార్టూన్ టైగర్'గా చూపించారు.
![Xi Jinping fears about Winnie the Pooh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7651218_china22.jpg)
2014.. జపాన్ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ప్రత్యక్షంగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ సమయంలో షింజోను గ్లూమీ డాంకీతో, జిన్ను 'విన్నీ'తో పోల్చుతూ మళ్లీ ఫొటోలు వైరలయ్యాయి.
ఆ తర్వాత హాంకాంగ్ రాజకీయ నాయకురాలు కేరీ లామ్‌ను జిన్‌పింగ్‌ను కలిసినప్పుడూ ఇదే తరహా బొమ్మలు విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.
![Xi Jinping fears about Winnie the Pooh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7651218_china33.jpg)
![Xi Jinping fears about Winnie the Pooh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7651218_china66.jpg)
2015.. జిన్‌పింగ్ ఓ పరేడ్‌లో పాల్గొనగా ఆయన చిత్రాలకు 'విన్నీ'ని జోడించి మీమ్స్ విడుదల చేశారు కొందరు నెటిజన్లు. ఇంకేముంది వాటిని చూసి గరం గరం అయిన జిన్.. చైనాలో ఆ కార్టూన్ కనపడకుండా నిషేధించారు. ఆ దేశంలోని సామాజిక మాధ్యమాలు, యాప్‌లు, సెర్చ్ ఇంజిన్‌లోనూ దీనికి సంబంధించిన వార్తలు కనిపించకుండా బ్లాక్ చేశారు. అంతేకాదు అక్కడ బాగా ఫేమస్ అయిన టిక్‌టాక్‌లోనూ విన్నీ కనిపించడానికి వీలులేదని హెచ్చరికలు జారీ చేశారు. అలా 'విన్నీ' పదమే ఆ దేశంలో వినిపించకుండా చేశారు.
![Xi Jinping fears about Winnie the Pooh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7651218_jinping.jpg)
అన్నీ మరిచిపోయిందేమో అని ప్రపంచం భావిస్తున్న సమయంలో 2018లో డిస్నీ.. క్రిస్టోఫర్ రాబిన్ అనే యానిమేషన్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అయితే ఇందులోనూ 'విన్నీ' పాత్ర ఉండటం వల్ల తమ దేశంలో సినిమా విడుదలకు అంగీకరించలేదు బీజింగ్.
![Xi Jinping fears about Winnie the Pooh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7651218_winnie_the_pooh.png)