చైనా ప్రయోగించిన రాకెట్ శకలాలు భూమిపై పడనున్నాయన్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఈ వారాంతంలోనే అవి భూమిని తాకనున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ విషయంపై ఇంతవరకు పెద్దగా పట్టనట్లు వ్యవహరించిన చైనా.. తొలిసారి స్పందించింది. రాకెట్ శకలాలు భూమిని తాకే లోపలే అవి కాలిపోతాయని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. దానివల్ల నష్టం జరిగే అవకాశాలు దాదాపు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
తాము ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ఏప్రిల్ 29న కోర్ మాడ్యూల్‌ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత నియంత్రణ కోల్పోగా అది భూమివైపు దూసుకొస్తోందని వెన్‌బిన్ తెలిపారు. అయితే, రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పటికే పూర్తిగా కాలిపోతుందని తెలిపారు. భూమిపై పడి నష్టం కలిగించడం అనేది దాదాపు జరగకపోవచ్చని చెప్పారు. సంబంధిత అథారిటీ ఎప్పటికప్పుడు దీనిపై వివరాలు అందిస్తుందని పేర్కొన్నారు.
చైనాకు చెందిన పలువురు నిపుణులు మాత్రం ఈ రాకెట్ అంతర్జాతీయ సముద్ర జలాల్లో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. జనావాసాలపై కూలే ముప్పు అత్యల్పమని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ నిపుణుడు జొనాథన్ మెక్‌డొవెల్ సైతం పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అదుపుతప్పిన రాకెట్.. భూమిపైకి శకలాలు!