చైనా రక్షణ మంత్రి వీ ఫెంగీతో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ మాస్కోలో భేటీ అయ్యారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సు కోసం మాస్కో వెళ్లారు రాజ్నాథ్. ఇదే వేదికగా ఫెంగీతో సమావేశమయ్యారు. ఇటీవల పాంగాంగ్ తీరం వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.
సమావేశంలో పాల్గొన్న భారత బృందంలో రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్, రష్యాలో భారత రాయబారి డీబీ వెంకటేశ్ వర్మ ఉన్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9.30 గంటలకు మాస్కోలో ప్రముఖ హోటల్లో ఈ భేటీ జరిగినట్లు సమాచారం.
అత్యున్నత భేటీ..
భారత్- చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి తొలి అత్యున్నత భేటీ ఇదే. ఇంతకుముందు విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరఫున వాంగ్ యీ ఫోన్లో సంభాషించారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా రష్యాకు వెళ్లారు రాజ్నాథ్. ఎస్సీఓ సదస్సుతో పాటు రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అయితే.. రాజ్నాథ్ షెడ్యూల్లో చైనా రక్షణ మంత్రితో భేటీ లేదు.