సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు షేర్ చేయడం మామూలే.. కానీ ఓ యువకుడి పెళ్లి ఫొటోలు చూసి నెటిజన్ల అవాక్కయ్యారు. ఎందుకంటే అతడు ఓ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌ను వివాహమాడాడు. ఈ ఘటన ఇండోనేసియాలోని జరిగింది.
జావా ద్వీపంలోని మేగ్లాంగ్ పట్టణానికి చెందిన ఖోయ్రుల్ అనే యువకుడు చేసుకున్న ఈ వింత పెళ్లి సోషల్ మీడియాలో వైరలైంది. సంప్రదాయ రీతిలో ఓ ఎలక్ట్రిక్ కుక్కర్‌ను అతడు పెళ్లి చేసుకున్నాడు. తాను పెళ్లి దుస్తులు ధరించి.. కుక్కర్‌ను కూడా చక్కగా అలంకరించాడు. అంతేకాదు.. ఆ కుక్కర్‌ను ముద్దు పెట్టుకుంటున్న ఫొటో సహా పలు చిత్రాలను షేర్ చేశాడు.
'నా భార్య నెమ్మదస్తురాలు'
తన 'ఎలక్ట్రిక్' భార్య చాలా నెమ్మదస్తురాలంటూ ఖోయ్రుల్ తన ఫొటోల్లో పేర్కొన్నాడు. తను ఎక్కువగా మాట్లాడదని, వంట చేయడం వచ్చని చెప్పుకొచ్చాడు.
బంధం తెగింది!
ఖోయ్రుల్ పెళ్లి కథలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే కుక్కర్‌తో అతని వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలువలేదు. పెళ్లి జరిగిన నాలుగు రోజులకే తమ వివాహంపై ఖోయ్రుల్ సోషల్ మీడియా మరో పోస్ట్ పెట్టాడు. తన జీవితంలో ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకున్నానని.. కుక్కర్‌కు విడాకులు ఇచ్చినట్లు తెలిపాడు. భారంగా అనిపించినా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని అన్నాడు. తనకు సరైన భాగస్వామి దొరకదని వాపోయాడు.
ఖోయ్రుల్ పోస్ట్‌పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేశారు. వైవాహిక జీవితంలోని ఒత్తిడిని అందరూ తట్టుకోలేరని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశారు.
ఇదీ చూడండి : స్పేస్‌లో సినిమా షూటింగ్.. రాకెట్లో వెళ్లిన డైరెక్టర్, హీరోయిన్