కరోనా వైరస్ ప్రభావంతో సతమతమవుతోన్న చైనా ఈ దశాబ్దంలో తొలిసారి తన పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసుకుంది. మార్చి 5న జరగాల్సిన సమావేశాల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రూపొందించిన తీర్మానానికి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ-చైనా పార్లమెంట్) స్థాయీ సంఘం ఆమోదం తెలిపింది.
చైనాలో జరిగే అతిపెద్ద రాజకీయ కార్యక్రమంగా ఎన్పీసీ వార్షిక సమావేశాలకు పేరుంది. ప్రతి సంవత్సరం చైనా పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్‌కు చెందిన 5 వేల మందికిపైగా ఉన్నత స్థాయి అధికారులు మార్చి నెలలో సమావేశమవుతారు. దేశ బడ్జెట్ సహా ప్రభుత్వ వార్షిక అజెండాను సిద్ధం చేయడానికి చర్చిస్తారు.
సాధారణంగా ఈ కార్యక్రమం వాయిదా వేయడం అరుదు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ సమావేశాలను వాయిదా వేయడం పార్టీ చరిత్రలో అసాధారణమైనదిగా అభివర్ణిస్తున్నారు.
వైరస్ వ్యాప్తిపై నియంత్రణ చర్యల ఆధారంగా సమావేశాలను పునఃప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బయటకు పంపించం!
నిర్బంధంలోని నగరాల్లో ఉన్న ప్రజలను బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామని వెలువడిన ప్రకటన అసంమజసమని వుహాన్ అధికారులు తెలిపారు. స్థానిక అధికారులను సంప్రదించకుండా ప్రకటన వెలువరించారని పేర్కొన్నారు. ఆ ప్రకటన చెల్లదని స్పష్టం చేశారు.
ఇటలీలో విజృంభణ
ఇటలీలో కరోనా మరణాల సంఖ్య నాలుగుకు చేరింది. ఉత్తర లోంబార్డీ ప్రాంతంలో 84 ఏళ్ల వృద్ధుడు వైరస్ కారణంగా మరణించినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇటలీలో సంభవించిన నాలుగు మరణాల్లో మూడు లోంబార్డీ ప్రాంతంలో జరగడం గమనార్హం. ఈ ప్రాంతంలో వైరస్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.
అధికారులు నియంత్రణ చర్యలు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతాల్లోని గ్రామాలను పూర్తిగా నిర్బంధించారు. లోంబార్డీలో 10 నగరాలు సహా మొత్తం 11 నగరాలను నిర్బంధంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే దేశంలో 150 మందికి కరోనా వైరస్ సోకినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
ఐరోపా దేశాలలో ఇటలీలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో జరిగే ప్రతిష్టాత్మక మిలాన్ ఫ్యాషన్ వీక్, వెనీస్ కార్నివాల్ సహా ఫుట్‌బాల్ మ్యాచ్‌లపైనా వైరస్ ప్రభావం పడింది.
పశ్చిమాసియాలో...
పశ్చిమాసియాలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. ఇప్పటికే ఇరాన్లో కొవిడ్ కేసులు నమోదు కాగా... తాజాగా కువైట్, బహ్రయిన్ దేశాల్లో కరోనా కేసులను గుర్తించారు.
కువైట్‌లో ముగ్గురికి ఈ మహమ్మారి సోకింది. బహ్రయిన్లో ఒకరికి వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు తెలిపారు. వీరందరూ ఇరాన్‌లోని మశహాద్ నగరం నుంచి ఆయా దేశాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. బాధితులను పర్యవేక్షణలో ఉంచినట్లు ఆయా దేశాల అధికారులు వెల్లడించారు.
కరోనా కారణంగా ఇరాన్లో ఇప్పటికే 12 మంది మరణించారు. మశహాద్ నగరంలో మూడు కేసులు నమోదయ్యాయి.