సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, చైనా చర్యలు చేపడుతున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. తొమ్మిదో విడత కమాండర్ స్థాయి చర్చల్లో కుదిరిన అంగీకారంలో భాగంగా వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. బుధవారం నుంచే ఉపసంహరణ ప్రారంభించినట్లు తెలిపింది.
పాంగాంగ్ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ జరుగుతున్నట్లు చైనా రక్షణ శాఖ ప్రతనిధి కర్నల్ వు కియాన్ తెలిపారు. ఇరువైపులా ఒకే తరహాలో బలగాల ఉపసంహరణ ఉంటుందని చెప్పారు. సైన్యం మినహా.. అన్ని రకాల యుద్ధ యంత్రాలను ఇరు దేశాలు వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
అయితే ఈ ప్రకటనపై భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
"తొమ్మిదో విడత కమాండర్ స్థాయి చర్చల్లో కుదిరిన అంగీకారం ప్రకారం భారత్-చైనా సైన్యం.. బలగాల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించాయి. పాంగాంగ్ దక్షిణ, ఉత్తర తీరాల నుంచి ఫ్రంట్‌లైన్ సైన్యాన్ని ప్రణాళిక ప్రకారం వెనక్కి పిలుస్తున్నాం. ఫిబ్రవరి 10న ఉపసంహరణ మొదలైంది."
-వు కియాన్, చైనా రక్షణ శాఖ ప్రతినిధి
గతేడాది ఏప్రిల్-మే నుంచి తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా బలగాల మధ్య ప్రతిష్టంభన మొదలైంది. దీన్ని పరిష్కరించేందుకు పలు విడతలుగా సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిగాయి. జనవరి 24న తొమ్మిదో విడత కార్ప్స్ కమాండర్ల భేటీ జరిగింది.