కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చైనా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగం వుహాన్‌లో విజయవంతమైతే.. మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ఇతర దేశాల్లోనూ అదనపు పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఆ దేశ పరిశోధకులు తెలిపారు.
వ్యాక్సిన్ కోసం తొలి దశ క్లినికల్ ట్రయల్‌కు అధికారులు ఆమోదం పలకగా.. మార్చి 16న వుహాన్‌లో పరీక్షలు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రయోగం సజావుగా సాగుతోందని, ఫలితాలు ఏప్రిల్‌లో వస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌ను చైనాలో ఉన్న విదేశీయులపైనా ప్రయత్నించినున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ను వైరస్ ప్రభావం ఉన్న ఇతర దేశాల్లో ఉపయోగించే అవకాశం ఉన్నట్లు చైనా ఇంజినీరింగ్ అకాడమీ సభ్యుడు చెన్ వూయ్ తెలిపారు.
సురక్షితమని తేలాలి
వ్యాక్సిన్ అభివృద్ధిలో చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇందుకోసం అంతర్జాతీయ స్థాయి పరిశోధకులకు సహకరించేందుకూ సిద్ధంగా ఉన్నట్లు చెన్ వివరించారు. వ్యాక్సిన్ వినియోగం కోసం ఆమోదం ఎప్పుడు లభిస్తుందో తెలియదని, మొదట ఈ వ్యాక్సిన్ సురక్షితమైందని నిర్ధరణ కావాలని అన్నారు.
ఇప్పటికే కరోనా వ్యాప్తి నియంత్రణకు చైనాలోని అనేక సంస్థలు వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రయత్నాల్లో మునిగిపోయాయి. ప్రస్తుతానికి ఈ మహమ్మారికి ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు.
కరోనా ప్రభావం..
ప్రపంచవ్యాప్తంగా ఎగబాకిన ఈ వైరస్.. ఇప్పటివరకు 47వేలమందిని పైగా బలికొంది. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్, అమెరికా తదితర దేశాల్లో ఈ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ఇదీ చదవండి:మద్యం దొరక్క స్పిరిట్ తాగి ఇద్దరు మృతి