చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్‌తో రోజురోజుకు మృత్యుఘోష పెరుగుతూ పోతోంది. ఈ వైరస్ బారిన పడి తాజాగా మరో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా డ్రాగన్ దేశంలో కరోనా మృతుల సంఖ్య 170కి చేరింది. ఇప్పటికే 6 వేల మందికి పైగా చికిత్స పొందుతుండగా కొత్తగా మరో 1,032 కేసులను గుర్తించినట్లు చైనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డ్రాగన్‌లో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 7,711కు చేరింది.
చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 17 దేశాలకు కరోనా వైరస్ విస్తరించగా సుమారు 60 వేల మంది వైద్య పరిశీలనలో ఉన్నారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగం పాలు పంచుకోవాలని చైనా సైన్యానికి ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదేశించారు. మరోవైపు విదేశీయులను సొంత దేశాలకు పంపించేందుకు సహకరిస్తామని ప్రకటించారు.