Officials Conduct Survey To Find Musi Expats : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది ప్రక్షాళలో కీలక అడుగు పడింది. నది అభివృద్ధిలో భాగంగా నివాసాలు కోల్పోయే వారికి పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి 1600 నిర్మాణాలు ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. బఫర్ జోన్, నది గర్భంలో నివాసాలు ఏర్పాటు చేసుకొని కొంత మంది నిరుపేదలు ఏళ్ల తరబడి జీవిస్తున్నారు.
నిర్వాసితులకు పునరావసం కల్పించేందుకు : నది ఒడ్డున చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఆ నిర్మాణాలను తొలగించే ముందు వారందరికీ పునరావాసం కల్పించేందుకు దాదాపు 15 వేల రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలోనే తమ పరిధిలోని మూసీ నది గర్భంలోని నిర్మాణాలపై దృష్టి సారించిన అధికారులు మూడు జిల్లాల పరిధిలో మున్సిపల్, రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మొత్తం 2,166 నిర్మాణాలుంటున్నట్లు గుర్తించారు.
మూడు జిల్లాల్లో రీసర్వే : హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595 మంది, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 మంది నిర్వాసితులు ఉన్నట్లు తేల్చారు. వారందరు నష్టపోకుండా ఉండేందుకు అధికారులు మరోసారి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నాలుగు బృందాలుగా ఏర్పడి గండిపేట, రాజేంద్రనగర్ పరిధిలోని మూసీలో సర్వే నిర్వహించారు.
హైదరాబాద్ కలెక్టర్ ఆదేశాలతో 16 బృందాలు రంగంలోకి దిగాయి. ఇంటి యజమానికి సంబంధించిన ఆధార్ కార్డు, దస్తావేజులు, కరెంట్ బిల్స్, అనుమతులకు సంబందించిన ఇతర పత్రాలను పరిశీలిస్తున్నారు.
నిర్వాసితుల వివరాల సేకరణ : అధికారుల గతంలో ప్రాథమికంగా యాప్‌లో నమోదు చేసిన వివరాలతో సరిపోలుస్తూ అదనపు వివరాలను తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇళ్లకు వరద ముంపు ఉంటుందని, నివాసానికి అనువుగా ఉండదని అధికారులు యజమానులకు వివరిస్తున్నారు. మూసీ నదిలో నిర్మించుకున్న వాటికంటే పక్కాగా రెండు పడకల గదుల ఇళ్లను ఇవ్వడం జరుగుతుందని, ఖాళీ చేయించే సమయంలో రవాణా ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుందని నిర్వాసితులకు చెబుతున్నారు. అలాగే వాణిజ్య పరంగా కూడా ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి? వాటికి సంబంధించిన ఆధారాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు.
అపోహలకు లోనుకావద్దు : ఈ సర్వే పూర్తైన అనంతరం అర్హులను గుర్తించి జీహెచ్ఎంసీ పరిధిలో రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించనున్నారు. ఆ తర్వాతే నది గర్భంలో ఉన్న నిర్మాణాల తొలగింపు చేపడతామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ స్పష్టం చేశారు. బఫర్ జోన్‌కు సంబంధించి పునరావాస చట్టం ప్రకారం పరిహారం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, ప్రభుత్వ అనుమతితో పరిహారం చెల్లించాకే భూసేకరణ చేస్తామని దాన కిషోర్ వెల్లడించారు. మూసీ పరిధిలో ఉన్న నిర్వాసితులు అనవసరమైన అపోహలకు లోను కావద్దని, అర్హులందరికీ పునరావాసం కల్పిస్తామని పేర్కొన్నారు.