అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్ అధికారికంగా ఎన్నికైన వేళ చైనా స్పందించింది. అమెరికా చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్.. ఎన్నికల ఫలితాలను చైనా గమనించిందని పేర్కొన్నారు. జో బైడెన్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నవంబర్ 25నే అభినందన సందేశం పంపించారని గుర్తు చేశారు.
"ద్వైపాక్షిక సంబంధాల స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించాలంటే ఇరు పక్షాలు సంఘర్షణ లేని స్ఫూర్తిని అవలంబించాలి. పరస్పరం గౌరవాన్ని అందించుకోవాలి. ఇరుదేశాల మధ్య సహకారంపై దృష్టిసారించి విభేదాలను పరిష్కరించుకోవాలి."
-వాంగ్ వెన్బిన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి
సోమవారం జరిగిన ఎలక్టోరల్ ఓట్ల లెక్కింపులో జో బైడెన్ గెలుపొందారు. 306 ఓట్లు బైడెన్ కైవసం చేసుకోగా.. డొనాల్డ్ ట్రంప్ 232 ఓట్లు దక్కించుకున్నారు. అధికారం చేపట్టేందుకు 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. ఈ మార్కును బైడెన్ సునాయాసంగా అధిగమించారు.
ఇదివరకే రష్యా నుంచి అభినందనలు అందుకున్నారు జో బైడెన్. ఎలక్టోరల్ ఓటింగ్ ప్రక్రియ ముగియగానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఈ మేరకు టెలిగ్రామ్ పంపించారు.