చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తోన్న వేళ.. మహమ్మారి కట్టడికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఆ దేశ యంత్రాంగం. విపరీతంగా పెరిగిపోతున్న కేసుల దృష్ట్యా హుబై రాష్ట్రంలో భారీ క్వారంటైన్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థ విడుదల చేసింది. జనవరి 13న ఖాళీగా కనిపించిన ప్రాంతంలో వందలకొద్దీ ఇళ్లు పదిరోజుల్లోనే నిర్మితమయ్యాయని ఈ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
యుద్ధ ప్రాతిపదికన..
ముఖ్యంగా హుబై రాష్ట్రం షిజియాంగ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోటికి పైగా జనాభా ఉన్న ఈ నగరంలో క్వారంటైన్ కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోంది అక్కడి ప్రభుత్వం. జనవరి 19నాటికి 600కి పైగా గదులు పూర్తి కాగా.. నిర్మాణం పూర్తయ్యే నాటికి మరో 3600గదులు అందుబాటులోకి వస్తాయని చైనా అధికారిక పత్రిక 'పీపుల్స్ డైలీ' వెల్లడించింది.
ప్రతి గదిలో ఒక్కో రోగి ఉండేలా ప్రస్తుత క్వారంటైన్ కేంద్రాన్ని నిర్మించారు. 190 చదరపు అడుగులతో ఉండే ఈ గదుల్లో ఏసీ, టీవీ, వైఫై వంటి సౌకర్యాలు ఉంటాయని చైనా వార్తా సంస్థలు తెలిపాయి.
వాస్తవానికి చైనాలో కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ.. శీతాకాలం అయినందున ఉత్తర చైనాలో మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా 145 పాజిటివ్ కేసులు నమోదైనట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.
భారీ నిర్మాణాలు..
ఈ నిర్మాణాల్లో సహాయం చేసేందుకు చైనా నలుమూలల నుంచి కార్మికులు, భవన నిర్మాణ సామగ్రిని తరలించారు. గత సంవత్సరం వైరస్‌కు కేంద్రబిందువైన వుహాన్‌లో కేవలం రోజుల వ్యవధిలోనే భారీ వైద్య శిబిరాన్ని చైనా నిర్మించింది.
ఇదీ చదవండి: చైనా గని ప్రమాదంలో 10 మంది మృతి