హాంకాంగ్‌లో పాలనపై పూర్తి నియంత్రణ సాధించేందుకు చైనా పావులు కదుపుతోంది. హాంకాంగ్ చట్టసభలో ప్రజల చేత ఎన్నికయ్యే నాయకుల సంఖ్యను తగ్గించి, ప్రభుత్వం ద్వారా నియమించే సభ్యుల సంఖ్యను చైనా పెంచనుంది. ఈమేరకు ఏర్పాటు చేసిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించారు.
అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా మొత్తం 2 వేల 895 మంది సభ్యులు హాంకాంగ్ సంస్కరణల తీర్మానాన్ని ఏకగీవ్రంగా ఆమోదించారు. ఎంతమంది చట్ట సభ్యులను ప్రభుత్వం నియమిస్తుందనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు 33 శాతం మందిని నియమించే అవకాశం ఉందని హాంకాంగ్ మీడియా పేర్కొంది.
'హాంకాంగ్ రక్షణ కోసమే'
హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని చైనా కాలరాస్తోందనే వార్తలను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ కొట్టిపారేశారు. హాంకాంగ్ రక్షణ, స్థిరత్వం కోసమే సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేశారు. మరింత స్వయంప్రతిపత్తిని కల్పించాలని కోరతూ హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్య వాదులు 2019నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని నిరంకుశంగా అణచి వేసిన చైనా.. 47 మంది చట్టసభ్యులను జైళ్లో నిర్బంధించింది. వారిపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి విచారిస్తోంది. నేరం నిరూపితమైతే ప్రజాస్వామ్యవాదులను జీవితఖైదు చేయాలని భావిస్తోంది.
ఇదీ చదవండి: 'టిబెట్‌లో చైనా జోక్యం తగదు.. ఆ దేశంలో స్వేచ్ఛ ఉండాల్సిందే'