భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమిని చైనా వ్యతిరేకించింది. ఏమీ లేని చోట సమస్యలు సృష్టించవద్దని అమెరికాను హెచ్చరించింది. అంతేకాదు.. ఈ ప్రాంతంలో శాంతిని పెంపొందించే చర్యలు చేపట్టాలని హితవు పలికింది. ఈ మేరకు చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ డిఫెన్స్‌లోని సీనియర్ కర్నల్ రెన్‌గావ్‌కియాంగ్ పేర్కొన్నారు. అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాక్ సులైవాన్ ఇటీవల చేసిన ప్రకటనకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రంపంచ శాంతికి చైనా కట్టుబడి ఉంది..
"అమెరికా ప్రోత్సాహంతో మొదలైన చతుర్భుజ కూటమిని మేము వ్యతిరేకిస్తున్నాం. అది ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని కొనసాగిస్తోంది. ఒక జట్టుగా పోరాడటాన్ని క్వాడ్ వ్యవస్థ నమ్ముతోంది. ఈ ప్రాంతంలోని దేశాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోంది. మేము దీనికి వ్యతిరేకం. శాంతి, అభివృద్ధితో ఇరుపక్షాలు లాభపడాల్సిన సమయం ఇది. దీనికి వ్యతిరేకంగా ఏ ఒక్కరి అవసరాలో తీరేందుకు ఉపయోగపడాలని భావిస్తే అది విఫలం కావడం ఖాయం. ప్రపంచ శాంతి, అభివృద్ధికి చైనా కట్టుబడి ఉంది" అని రెన్ పేర్కొన్నారు.
అమెరికాపై మండిపాటు..
ఇక ఇటీవల అమెరికా విడుదల చేసిన ఇండో-పసిఫిక్ వ్యూహపత్రంలో చైనాను ఆర్థిక, సైనిక పోటీదారుగా పేర్కొనడాన్ని రెన్ తప్పుబట్టారు. "అమెరికా కొత్త శత్రువులను తయారు చేసుకోవడం.. ముప్పుతో చెలగాటాలాడటం తప్ప ఏం చేసింది. తన ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి ఇలా చేస్తోంది. ఆ పత్రంలో ఈ విషయం స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. తన ఆధిపత్యం కొనసాగాలనే మొండితనంతో ఇలా వ్యవహరిస్తోంది. చైనా సైన్యానికి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకొనే శక్తి ఉంది. వారు దానికి కట్టుబడి ఉన్నారు" అని రెన్ మండిపడ్డారు.
ఇవీ చదవండి: