China Restrictions Xian: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు చైనా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. ఇదే ప్రస్తుతం స్థానికులకు సమస్యగా మారింది. లాక్‌డౌన్‌తో ఉత్తర షియాన్ నగరంలోని 1.3కోట్ల మంది ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలపై సామాజిక మాధ్యమాల ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే అధికారులు మాత్రం ప్రజలకు ఆహారం సహా నిత్యవసరాల సరకులకు ఎలాంటి కొరతలేదని చెప్పుకొస్తున్నారు. నగరంలో కఠిన ఆంక్షలను విధించడాన్ని సమర్థించుకున్నారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టాలంటే ఈ చర్యలు తప్పవని పేర్కొన్నారు.
షియాన్ నగరంలో గత రెండు వారాలుగా లాక్డౌన్ అమలులో ఉంది.
జర్మనీలో ఆంక్షల సడలింపు..
విదేశీ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను జర్మనీ సడలించింది. ఇందులో భాగంగా యూకే, దక్షిణాఫ్రికా సహా మరో ఏడు ఆఫ్రికా దేశాలపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ ప్రకటించింది. ఈ దేశాలను వైరస్ వేరియంట్ ప్రాంతాల జాబితా నుంచి తొలగించింది. సంబంధిత దేశాల నుంచి వచ్చే జర్మనీ వాసులు కచ్చితంగా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని స్పష్టం చేసింది.
జర్మనీలో కొత్తగా 30,561 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇతర దేశాల్లో ఇలా...
ఆస్ట్రేలియాలో కొత్తగా 47వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,47,160కు చేరుకుంది.
- అమెరికాలో కొత్తగా 4,08,874 లక్షల కేసులు నమోదయ్యాయి. 708మంది ప్రాణలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,48,826 చేరింది.
- బ్రిటన్‌లో కొత్తగా 1,57,758 కేసులు నమోదయ్యాయి. 42మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.
- ఇటలీలో 68,052కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 140మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 63,96,110కు పెరిగింది. మరణాల సంఖ్య 1,37,786కు చేరుకుంది.
- ఫ్రాన్స్‌లో 67,461 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 270 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,24,212కు చేరింది.
ఇదీ చూడండి : ఒక్కరోజే 10 లక్షల కరోనా కేసులు.. అమెరికాలో ఏం జరుగుతోంది?