కరోనా ధాటికి అస్తవ్యస్తమైన చైనాలో తాజాగా మరో 45మందికి వైరస్ సోకింది. వీరిలో ఒకరు చైనావాసి ఉండగా మిగిలిన వారంతా విదేశీయులు. దీనితో వైరస్ బారిన పడిన విదేశీయుల సంఖ్య 693కు చేరింది. మొత్తం మీద కరోనా కేంద్రబిందువు చైనాలో 81వేల 439కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ మహమ్మారి వల్ల చైనాలో తాజాగా ఐదుగురు మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 3వేల 300కు చేరింది.
- చికిత్స పొందుతున్న వారు- 2,691
- డిశ్చార్చ్ అయిన వారు- 75,448
- పరిస్థితి విషమంగా ఉన్నవారు- 742
అగ్రరాజ్యం విలవిల...
కరోనా వైరస్‌తో అమెరికా విలవిలలాడుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే ఎక్కువ కేసులు నమోదైన అగ్రరాజ్యంలో.. తాజాగా మరో 21వేల 309మందికి వైరస్ సోకింది. ఇది 23 శాతం ఎక్కువని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,23,750కు చేరింది.
అమెరికాలో మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. తాజా మరణాలతో. మొత్తం మృతుల సంఖ్య 2,227కు చేరింది.
కోలుకున్న ప్రధాని భార్య
వైరస్ బారిన పడ్డ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సతీమణి ఆరోగ్యం మెరుగుపడింది. వైరస్‌ను జయించడం వల్ల ఆమెకు కెనడా ప్రభుత్వం క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను అందించింది. ఈ విషయాన్ని సోఫియా ట్రూడో స్వయంగా మీడియాకు తెలిపారు.
ఇదీ చూడండి:- ప్రపంచంపై కరోనా పంజా.. 30వేలు దాటిన మరణాలు