తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద భారత సైన్యం అదుపులోకి తీసుకున్న తమ సైనికుడిని అప్పగించాలని చైనా కోరింది. చీకటి, కష్టమైన దారి వల్ల తమ సైనికుడు దారి తప్పి భారత భూభాగంలోకి అడుగుపెట్టారని తెలిపింది. సంబంధిత ఒప్పందాలను పాటిస్తూ తమ సైనికుడిని తిరిగి అప్పగించాలని చైనా స్పష్టం చేసింది.
"పీఎల్ఏ సరిహద్దు భద్రతా దళం భారత్‌కు సమాచారం అందించిన సుమారు 2 గంటల తర్వాత జవాను ఆచూకీ లభించించినట్లు భారత్ నుంచి జవాబు అందింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందిన తర్వాత చైనాకు అప్పగిస్తామని వారు తెలిపారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు భారత్ కట్టుబడి ఉండాలి. సైనికుడిని అప్పగించే విషయంలో సమయం వృథా చేయొద్దు. త్వరగా అప్పగించటం ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనలో సానుకూల ఫలితానిస్తుంది. అలాగే.. చైనా-భారత్ సరిహద్దులో ఇరువర్గాలు శాంతి, సామరస్యాాన్ని పాటించాలి. "
- చైనా సైన్యం.
తూర్పు లద్దాఖ్ లో భారత్-చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా జవాన్ భారత భూభాగంలోకి రావడం కలకలం సృష్టిస్తోంది. తెల్లవారుజామున పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికుడిని గుర్తించిన భద్రతాదళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. సైనిక నిబంధనల మేరకు చైనా సైనికుడిని విచారణ చేస్తున్నామన్న అధికారులు సరిహద్దు దాటి రావాల్సిన పరిస్థితులపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని చైనా సైన్యానికి కూడా సమాచారం ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. డ్రాగన్ జవాన్ భారత భూభాగంలోకి రావడం గత నాలుగునెలల్లో ఇది రెండోసారి. గతేడాది అక్టోబరులో తూర్పు లద్దాఖ్ లోని డెమ్ చోక్ సెక్టార్ లో చైనా సైనికుడిని భారత బలగాలు అదుపులోకి తీసుకొని మూడు రోజుల దర్యాప్తు తర్వాత వదిలేశాయి.
ఇదీ చూడండి: చైనా జవానును అదుపులోకి తీసుకున్న సైన్యం