ఆస్ట్రేలియాపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. డెల్టా వేరియంట్ విజృంభణతో అక్కడ కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన మెల్బోర్న్.. ఆరోసారి లాక్డౌన్లోకి వెళ్లింది. గురువారం నుంచి వారంపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ తెలిపారు. అయితే.. నాలుగు గంటల గడువు మాత్రమే ఇచ్చి లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
ఇప్పటికే సిడ్నీ, బ్రిస్బేన్ వంటి నగరాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. మెల్బోర్న్తో పాటు, విక్టోరియా రాష్ట్రంలో ఎనిమిది కొత్త కొవిడ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో.. లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నామని డేనియల్ ఆండ్రూస్ పేర్కొన్నారు. తమ వద్ద మరో అవకాశం లేనందునే ఇలా చేస్తున్నామని చెప్పారు. ఆస్ట్రేలియాలో కేవలం 20శాతం మందికే రెండు డోసుల వ్యాక్సిన్ అందిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సిడ్నీపై డెల్టా ప్రతాపం..
మరోవైపు.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోనూ కరోనా డెల్టా వేరియంట్ విజృంభణ కొనసాగుతోంది. ఆ నగరంలో 262 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో నలుగురు టీకా తీసుకోలేదని న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ గ్లాడిస్ బెరెజిక్లియన్ తెలిపారు. మరొకరు మే నెలలో ఆస్ట్రాజెనెకా మొదటి డోసు టీకా మాత్రమే తీసుకున్నారని చెప్పారు. టీకా మొదటి డోసు తీసుకుని 12 వారాల గడిస్తే.. వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవాలని ప్రజలు ముందుకు రావాలని సిడ్నీ ప్రజలను అధికారులు కోరారు.
ఇదీ చూడండి: చైనాలో 'డెల్టా' విజృంభణ- ఎక్కడికక్కడ లాక్డౌన్!
టోక్యోలో రికార్డు స్థాయి కేసులు
ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న జపాన్ టోక్యో నగరంలో కరోనా కోరలు చాస్తోంది. టోక్యోలో రికార్డు స్థాయిలో 5,042 కొత్త కేసులు వెలుగు చూశాయి. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇంతటి భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే ప్రథమం.
తాజా కేసులతో కలిపి టోక్యోలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,36,138కి చేరింది.
జపాన్ వ్యాప్తంగా కొత్తగా 14,000 కేసులు వెలుగు చూడగా.. మొత్తం కేసుల సంఖ్య 9,70,000కు చేరింది. జపాన్‌లో కరోనా కేసులు పెరగడానికి ఒలింపిక్స్ నిర్వహించడమే కారణమనే ఆరోపణలను ఆ దేశ ప్రధాని యోషిహిదే సుగా ఖండించారు.
ఇదీ చూడండి: 'డెల్టా' దెబ్బకు ఆసుపత్రులు ఫుల్- మళ్లీ ఆంక్షలు!
ఆటో షో బంద్..
అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభణ నేపథ్యంలో.. 'ద న్యూయార్క్ ఆటో షో'ను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 19న ఈ షో ప్రారంభం కావాల్సి ఉండగా.. దీన్ని రద్దు చేస్తున్నట్లు ఈ షో ప్రతినిధి క్రిస్ సామ్స్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో దీన్ని నిర్వహిస్తామని చెప్పారు.
మరోవైపు.. అమెరికాకు వచ్చే విదేశీయులు తప్పనిసరిగా టీకా తీసుకునేలా నిబంధనలు విధించాలని బైడెన్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: అమెరికాలో భారీగా కేసులు- టీకా ఉత్పత్తికి 'క్వాడ్' సన్నాహాలు