రక్త పరీక్ష ద్వారా 20 నిమిషాల్లోనే కరోనాను నిర్ధరించే విధానాన్ని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. కరోనా కారక సార్స్ కోవ్-2 వైరస్‌ను ఎదుర్కొనేందుకు రక్తంలో వృద్ధి చెందే యాంటీబాడీలను ఈ పరీక్షలో సులువుగా గుర్తించొచ్చు. పరిశోధనలో భాగంగా.. ఇటీవల వైరస్ భారిన పడిన వారి రక్త నమానాల నుంచి 25 మైక్రోలీటర్ల ప్లాస్మాను వీరు పరీక్షించారు. కొవిడ్-19 రోగుల్లో సంయోజనం/గుత్తిగా మారే ఎర్రరక్త కణాలను సులువుగా గుర్తించవచ్చని, ఇలా 20 నిమిషాల్లోనే అది వైరస్ పాజిటివ్‌నా లేక నెగెటివ్‌నా అన్నది చెప్పేయవచ్చన్నారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న స్వాబ్/పీసీఆర్ పరీక్షల్లో ఆ సమయానికి కరోనాతో ఉన్నవారినే గుర్తించే వీలుంది. అదే మోనాష్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్న సులభ సంకలన పరీక్షలో అయితే ఇటీవల కరోనా వచ్చి తగ్గిపోయిన వారినీ గుర్తించవచ్చు. అలాగే టీకాల ఔషధ పరీక్షల్లో యాంటీబాడీల వృద్ధిని త్వరగా తెలుసుకోవచ్చు. ఈ తరహాలో చిన్న ల్యాబ్‌లోనే గంటకు 200 మంది రక్త నమూనాలను పరీక్షించొచ్చు. అదే పెద్ద ఆస్పత్రుల్లో అత్యాధునిక డయాగ్నోస్టిక్ యంత్రాలున్న చోట గంటకు 700 నమూనాల చొప్పున రోజుకు 16,800 మందిని పరీక్షించొచ్చు. ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఇలా పరీక్షలు నిర్వహిస్తేనే.. వైరస్ వ్యాప్తిని వేగంగా కట్టడి చేయవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కరోనా మహాఉద్ధృతి- కోటీ 45 లక్షలకు చేరువలో కేసులు!