పాకిస్థాన్‌లోని గురుద్వారా నన్కానా సాహిబ్‌పై జరిగిన దాడిని 'శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ' తీవ్రంగా ఖండించింది. అక్కడి వాస్తవిక పరిస్థితులు తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నలుగురు సభ్యులతో కూడిన బృందం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ బృందం నన్కానా సాహిబ్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులపై నివేదికను ఇవ్వనున్నట్లు ఎస్జీపీసీ చీఫ్ గోవింద్ సింగ్ లాంగోవాల్ తెలిపారు.
"పాకిస్థాన్‌లోని గురుద్వారా నన్కానా సాహిబ్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. అంతేకాకుండా అక్కడ నివసించే సిక్కులకు భద్రత కల్పించాలని పాక్ సర్కార్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని పంపిస్తున్నాం".
-గోవింద్ సింగ్ లాంగోవాల్, ఎస్జీపీసీ చీఫ్.
ఈ బృందం అక్కడి సిక్కుల కుటుంబాలను కలుసుకోనున్నట్లు సింగ్ తెలిపారు. అంతేకాకుండా పాకిస్థాన్‌లోని పంజాబ్ గవర్నర్, ముఖ్యమంత్రులతో సమావేశమవుతారని వెల్లడించారు. ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకొని వెళ్లనున్నట్లు సింగ్ స్పష్టం చేశారు.
భారత్‌లోని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ ప్రాంతంలో శాంతి, సామరస్యాన్ని కలిగించేలా భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి:భద్రత లేని ఏటీఎం చోరీ.. 2 లక్షల నగదు మాయం!