చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో వరద బీభత్సానికి 12 మంది మృతి చెందారు. గత కొన్నిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు యాంగ్జే నది ఉగ్రరూపం దాల్చింది. ఉపనదులు ఉప్పొంగుతుండటం వల్ల...యాంగ్జే నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతంలోని యిహై టౌన్‌షిప్ పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 7 వేల 705 మందిని యిహై నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
లక్ష ఇళ్లు ధ్వంసం..
భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి ఇళ్లపై పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు లక్షకుపైగా ఇళ్లు ధ్వంసం అయినట్లు పేర్కొన్నారు. వరద ఉద్ధృతికి అనేక ప్రాంతాల్లో చెట్లు కూలి... రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విపత్తు నిర్వాహణ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సుమారు 3.5 బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
1998 తర్వాత...
1998లో సంభవించిన వరదల తరువాత మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడే వరద ఉద్ధృతి ఉన్నట్లు పేర్కొన్నారు.