అఫ్గానిస్థాన్‌లో బాంబుదాడులు కలకలం రేపుతున్నాయి. కాబుల్‌లోని వివిధ ప్రాంతాల్లో శనివారం ఉదయం జరిగిన వరుస బాంబు పేలుడు ఘటనల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడగా.. వారిలో ఓ పౌరుడూ ఉన్నట్టు సమాచారం.
పశ్చిమ కాబుల్‌లో పోలీసు వాహనానికి అమర్చిన అయస్కాంత బాంబు పేలుడు వల్ల ఇద్దరు పోలీసులు మరణించారని అక్కడి అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అనంతరం దక్షిణ కాబుల్ ప్రాంతంలో బాంబుపేలి మరో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడినట్టు పేర్కొన్నారు. తూర్పు ప్రాంతంలోనూ మూడో పేలుడు సంభవించగా.. అక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
రాజధాని ప్రాంతంలో జరిగిన ఘటనలపై ఇప్పటివరకు పోలీసులకూ ఎలాంటి వివరాలు అందకపోవడం గమనార్హం.
ఈ బాంబుదాడులకు ఎవరూ తక్షణ బాధ్యత వహించలేదు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐఎస్జీ) ఇటీవల అక్కడ ఎక్కువగా దాడులకు పాల్పడుతోంది. విద్యాసంస్థలపై ఐఎస్జీ ఇప్పటివరకు చేసిన దాడుల్లో సుమారు 50మంది చనిపోగా.. వారిలో విద్యార్థులే అధికం.
అయితే.. దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ వైరాన్ని తొలగించేందుకు.. ఖతార్‌లో తాలిబన్లకు, ప్రభుత్వానికి కొంతకాలంగా శాంతిచర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించడం ఆందోళనకరం.
ఇదీ చదవండి: క్రిస్మస్ వేళ అమెరికాలో బాంబు పేలుడు కలకలం