తాలిబన్ల(Afghanistan Taliban) గత పాలనా అనుభవాలు దృష్ట్యా స్థానికులూ అఫ్గాన్‌ను(Afghanistan) విడిచిపెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఆస్తులన్నీ అక్కడే వదిలి.. పిల్లాపాపలు, కట్టుబట్టలతోనే విమానం ఎక్కేస్తున్నారు. ఇదే క్రమంలో శనివారం అఫ్గాన్‌కు చెందిన ఓ నిండు గర్భిణి..(Afghan woman) యూఎస్ ఎయిర్‌ఫోర్స్ సీ-17 విమానం ఎక్కారు. ఇది జర్మనీలోని అమెరికాకు చెందిన రామ్‌స్టెయిన్ బేస్‌కు వెళ్తోంది.
ప్రయాణ క్రమంలో భూమి నుంచి 8500 మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో విమానంలో 'లో ఎయిర్ ప్రెషర్' ఏర్పడింది. దీంతో ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో అప్రమత్తమైన పైలట్.. వెంటనే విమానాన్ని తక్కువ ఎత్తుకు తీసుకొచ్చారు. లోపల వాయు పీడనాన్ని పెంచి.. ఆమె ప్రాణాలను నిలిపారు. బేస్‌లో ల్యాండ్ అయ్యాక వైద్య సిబ్బంది హుటాహుటిన ఆమె వద్దకు చేరుకున్నారు. విమానంలోనే ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చారు. అనంతరం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని అమెరికా 'ఎయిర్ మొబిలిటీ కమాండ్' అధికారులు ట్విటర్ వేదికన వెల్లడించారు. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి హర్షం వ్యక్తమైంది. సైనికాధికారుల సమయస్ఫూర్తిని కొనియాడుతూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చూడండి: Afghan crisis: 'దేశం వీడి వెళ్తారా? కాల్చి పడేస్తాం!'