బాంబు పేలుళ్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దేశం అఫ్గానిస్థాన్. ఆ దేశంలో తాలిబన్లు ఎన్నో ఏళ్లుగా హింసాకాండ సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్లతో శాంతి చర్చలు పునరుద్ధరించింది అఫ్గాన్ ఉన్నతస్థాయి అధికారుల బృందం. జర్మనీ, ఖతార్ సంయుక్తంగా ఈ రెండు రోజుల చర్చలను నిర్వహించాయి. ఖతార్ రాజధాని దోహాలో సుమారు 70 మంది అధికారులు చర్చలకు హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందం, మహిళ హక్కులపై చర్చించారు.
వచ్చే వారం అమెరికా-తాలిబన్ల చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 18 ఏళ్ల పాటు జరుగుతోన్న మారణహోమానికి ముగింపు పలికేందుకు ఇరు బృందాలతో చర్చలు జరుపుతోంది అమెరికా. ఈ అంశంపై అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పందించారు. అఫ్గాన్- తాలిబన్ చర్చల కోసం ఎదురుచూస్తున్నట్టు పాంపియో వెల్లడించారు. అఫ్గాన్ ప్రభుత్వం, ప్రజలు, మహిళలు, తాలిబన్ల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
సెప్టెంబర్లో అఫ్గాన్ అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తాలిబన్లతో చర్చలు జరిపి ఒప్పందం చేసుకోవాలని అగ్రరాజ్యం పేర్కొంది. ఆ దేశం నుంచి విదేశీ బలగాల ఉపసంహరణకు అనుమతి కల్పించాలని తెలిపింది.
"తాలిబన్లతో సమావేశానికి హాజరైన ప్రతిఒక్కరు కాల్పుల విరమణ ఒప్పందంపై దృష్టి సారించారు. తాలిబన్లు ప్రధానంగా మహిళల పాత్ర, ఆర్థిక అభివృద్ధి, దేశంలో మైనారిటీల పాత్రపై మాట్లాడారు."
- అసిలా వార్దక్, అఫ్గాన్ శాంతి మండలి సభ్యురాలు.
తాలిబన్లతో తాజాగా మూడోసారి భేటీ అయ్యారు అఫ్గాన్ అధికారులు. వీరి మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి, మే లో రష్యా రాజధాని మాస్కోలో శాంతి చర్చలు జరిగాయి.
ఇదీ చూడండి:పోర్చుగల్ 'బతుకమ్మ పండుగ' గురించి తెలుసా?