శ్రీలంకలో ఈస్టర్ పర్వదినాన జరిగిన మారణహోమంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తం 9 మంది ఆత్మాహుతి దళ సభ్యులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. వీరిలో ఒకరు మహిళని తేల్చారు. ఉగ్రఘాతుకానికి పాల్పడ్డ వారిలో చాలామంది ఉన్నత, ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబాలకు చెందిన వారే. వీరిలో కొంతమంది విదేశాల్లో విద్యనభ్యసించి శ్రీలంకలో స్థిరపడడానికి వచ్చారని అధికారులు తెలిపారు.
దాడుల సూత్రధారుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు 60 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారందరూ శ్రీలంక వాసులేనని ప్రకటించారు. వీరందరూ స్థానిక తీవ్రవాద సంస్థలకు చెందినవారుగా భావిస్తున్నారు.
ఎన్టీజే కాదు... ఐసిస్ కాదు...
శ్రీలంక ఉగ్రదాడి నేషనల్ తాహీద్ జమాత్(ఎన్టీజే) పనేనని తొలుత శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. అయితే... ఎన్టీజేకు ప్రత్యక్ష సంబంధం లేదని, అనుబంధ సంస్థే ఈ దాడి చేసిందని తాజాగా రక్షణ శాఖ సహాయ మంత్రి రువాన్ విజయవర్దనే స్పష్టంచేశారు. మారణహోమం తమ పనేనని ఐసిస్ ప్రకటించుకున్నా... అందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు.
మరో పేలుడు...
వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొలంబోలోని ఓ సినిమా హాల్ వద్ద అనుమానాస్పదంగా నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని ఖాళీ చేయించారు. పోలీసులే ఆ ద్విచక్రవాహనం వద్ద పేలుడు జరిపారు. చివరకు అక్కడ ఎలాంటి పేలుడు పదార్ధాలు లేవని నిర్ధరించుకున్నారు.
మాకేం తెలియదు...
శ్రీలంక మారణహోమంపై తమకెలాంటి ముందస్తు సమాచారం లేదని అమెరికా తెలిపింది. అగ్రరాజ్యానికి దాడుల గురించి ముందే తెలుసన్న ఆరోపణలను శ్రీలంకలోని అమెరికా రాయబారి ఖండించారు.
"నేను ఇతరుల కోసం మాట్లాడటం లేదు. శ్రీలంక ప్రభుత్వం వద్ద ఉన్న ఇతర సమాచార కేంద్రాలు ఏమిటో నాకు తెలియదు. మాకు ఈ దాడుల గురించి ముందస్తుగా తెలియదని మాత్రమే నేను చెప్పగలను."
- అలైనా టెప్లిజ్, శ్రీలంకలోని అమెరికా రాయబారి