కరోనాపై పోరులో పాకిస్థాన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వైరస్ను కట్టడి చేయటంలో ముందుడే వైద్యులకే సరైన రక్షణ కల్పించటం లేదనే కారణంతో పంజాబ్ రాష్ట్రంలోని బోధనా ఆస్పత్రులకు చెందిన 48 మంది డాక్టర్లు రాజీనామా చేశారు.
48 మంది యువ వైద్యుల రాజీనామాలు ఆమోదించినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది పంజాబ్ ఆరోగ్య శాఖ.
"కరోనా నుంచి రక్షించుకునేందుకు తమకు తగిన రక్షణ సౌకర్యాలు కల్పించాలని పలు మార్లు కోరినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడం వల్లే వైద్యులు రాజీనామా చేశారు. వైద్య సిబ్బంది భద్రత పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. కొవిడ్-19పై మేము ముందుండి పోరాడుతున్నాం. మాకు ఇమ్రాన్ ప్రభుత్వం ఏమి చేసిందో కనిపిస్తూనే ఉంది. జీతాలు, వ్యక్తిగత భద్రత కిట్లు అందించాలని నిరసన తెలిపినందుకు కొన్ని రోజుల క్రితం ముజఫరాబాద్(పీఓకే)లో వైద్యులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. 23 మంది యువ వైద్యులను అరెస్ట్ చేసిన క్రమంలో పీఓకేలోని అన్ని ఆస్పత్రుల్లో అత్యవసర సేవలను నిలిపివేశారు."
- సీనియర్ వైద్యుడు, పంజాబ్
ప్రభుత్వం ఇకనైనా స్పందించకపోతే మరింత మంది వైద్యులు రాజీనామా చేస్తారని హెచ్చరించారు. అయితే.. ప్రభుత్వం వైద్యులకు, సిబ్బందికి అన్ని రకాల భద్రత కిట్లు అందించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. యాస్మిన్ రషీద్ తెలిపారు.
పాకిస్థాన్లో ఇప్పటి వరకు 5,000 మంది ఆరోగ్య నిపుణులు వైరస్ బారిన పడ్డారు. అందులో 3వేల మంది డాక్టర్లు, 600 మంది నర్సులు ఉన్నారు. మొత్తం 70 మంది వైద్యులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అందులో 35 మంది వైద్యులు పంజాబ్ వారే ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి: మంచుపై సర్రున జారుతూ స్కీయింగ్.!