పాకిస్థాన్‌లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు వేరువేరు ఘటనల్లో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ పక్తుంఖ్వా రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. గుర్తు తెలియని దుండగులు జరిపిన ఈ కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు.
పెషావర్‌లోని మిచ్నీ రోడ్లో ఓ కారుపై ఆకస్మికంగా దాడి చేశారు దుండగులు. ముహమ్మద్ అలీ అనే వ్యక్తితో పాటు అతని ఇద్దరు గన్మెన్లను కాల్చిచంపారు. ఈ క్రమంలో మరో ఆరుగురు గాయపడ్డారు.
హరిపుర్ జిల్లాలో జరిగిన మరో దాడిలో అధికార తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాహీర్ ఇక్బాల్ హత్యకు గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇక్బాల్ ముగ్గురు స్నేహితులు గాయపడ్డారు.
ఈ దాడిపై ఖైబర్ పక్తుంఖ్వా ముఖ్యమంత్రి మెహ్ముద్ ఖాన్ విచారణకు ఆదేశించారు. ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్ర పోలీసు ముఖ్య అధికారికి ఆదేశాలు జారీ చేశారు.