తాలిబన్ల దాడులతో అట్టుడుకుతోంది అఫ్గానిస్థాన్. గత వారంలో తాలిబన్ దాడుల్లో సుమారు 291 మంది సైనికులు మృతి చెందగా... 550 మందికి గాయలయ్యాయని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అఫ్గాన్‌పై 2001లో అమెరికా దాడి తర్వాత అత్యధికంగా భద్రత బలగాలు మరణించడం ఇదే తొలిసారి అని తెలిపింది. తాలిబన్లు, అమెరికా మధ్య జరిగిన శాంతి ఒప్పందం ప్రకారం... అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్లు చర్చలకు సిద్ధమవుతున్న క్రమంలో హింస చెలరేగడం చర్చనీయాంశమైంది.
"దేశంలోని మొత్తం 34 రాష్ట్రాలు ఉండగా... 32 రాష్ట్రాల్లో 422 సార్లు తాలిబన్లు గతవారంలో దాడి చేశారు. ఈ దాడుల్లో 291 మంది అఫ్గాన్ జాతీయ రక్షణ, భద్రత దళాల (ఏఎన్డీఎస్ఎఫ్) సభ్యులు మరణించగా... 550 మంది క్షతగాత్రులయ్యారు."
-జావీద్ ఫైజల్, జాతీయ భద్రత మండలి (ఎన్ఎస్సీ) ప్రతినిధి
గత 19 ఏళ్లల్లో ఎప్పుడూ జరగని విధంగా హంసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం వల్ల భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయని ఎన్ఎస్సీ అధికారులు మరో ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. ఈ దాడుల్లో 42 మంది పౌరులు చనిపోగా.. మరో 100మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు.
ఆ ప్రకటన అవాస్తవం..
ప్రభుత్వం ప్రకటించినట్లు గతవారం అధిక సంఖ్యలో దాడులు జరగలేదని... సమస్య మరింత జటిలం చేయడానికే క్షతగాత్రుల సంఖ్యను 50 నుంచి 500 పెంచి చెబుతున్నారని విమర్శించారు తాలిబన్ ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్. హింసాత్మక ఘటనలు జరిగాయని... కానీ భద్రత దళాల నుంచి రక్షణ కోసమే దాడులు చేశామన్నారు ముజాహిద్.
ఇదీ చూడండి: జవాన్ల మృతిపై మళ్లీ జవాబు దాటవేసిన చైనా