కొత్త ఏడాది రోజున ప్రపంచమంతా వేడుకలు చేసుకుంటుంటే ఇండోనేసియాలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయింది. రాజధాని జకార్తాలో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నూతన సంవత్సరం తొలిరోజున 18 మంది మృతి చెందినట్లు దేశ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది.
భారీ వర్షాల కారణంగా నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాజధాని శివారులోని బొగొర్, డెపొక్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వరదల్లో వాహనాలు చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని 31 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రంగంలోకి 1.20 లక్షల సిబ్బంది
జకార్తా, దక్షిణ జావా ప్రాంతాల్లో 37 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కిలివాంగ్, కిసాడనే నదులు ఉప్పొంగినట్లు వెల్లడించారు. దాదాపు లక్షా ఇరవై వేల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు చెప్పారు. స్థానిక విమానాశ్రయం రన్‌వేపైకి వరదనీరు చేరుకోవడం వల్ల విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో 19 వేల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది.