పాకిస్థాన్ బలూచిస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని ముష్కరులు.. 11 మంది బొగ్గు గని కార్మికులను బలితీసుకున్నారు. పనులకు వెళ్తున్న వారిని.. కిడ్నాప్ చేసి సమీప కొండల్లోకి తీసుకెళ్లి కాల్పులకు ఒడిగట్టారు. వారిలో ఆరుగురు ఘటనా ప్రాంతంలోనే అసువులు బాయగా.. మిగిలిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
"బొగ్గు గని కార్మికులు పనికెళ్తుండగా గుర్తు తెలియని ముష్కరులు వారిని అపహరించారు. మచ్ అనే ప్రాంతానికి దగ్గర్లో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి వారిపై కాల్పులు జరిపారు." అని పోలీసులు తెలిపారు.
దాడి అనంతరం ఘటనా ప్రదేశాన్ని పోలీసులు, ఆర్మీ అధికారులు, జిల్లా పరిపాలనా బృందం పరిశీలించింది.
ఖండించిన సీఎం..
బలూచిస్థాన్ ముఖ్యమంత్రి జమ్ కమల్ ఖాన్.. ఈ ఘటనను ఖండించారు. సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరారు. 'అమాయకుల ప్రాణాలు తీయడం ద్వారా ముష్కరులకు కలిగే లాభాలేంటని' అన్నారు.
ఇదీ చదవండి: భారీ వర్షాలనూ లెక్కచేయని అన్నదాతలు