చైనాలో భారీ ప్రమాదం జరిగింది. యిమా నగరంలోని ఓ గ్యాస్ ప్లాంట్లో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పేలుడు జరగటానికి ప్రమాదకర వస్తువులు ఉన్న ట్యాంకులు కారణం కాదని స్థానిక అధికారులు వెల్లడించారు. గ్యాస్ ప్లాంట్లో సుమారు 1200 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిపారు.
భారీ పేలుడు ధాటికి సమీప ఇళ్ల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సమీప దుకాణాల్లోని అద్దాలు పగిలి కొంత మంది గాయపడ్డారు. పేలుడు జరిగినప్పుడు పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీ స్థాయిలో పొగ వెలువడింది. ఆ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచదేశాలు ఏకం కావాలి'