అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఆ దేశ ఉపాధ్యక్షుడు అమరుల్లా సలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 10 మంది పౌరులు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సలే స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డట్లు నిఘా అధికారి ఒకరు వెల్లడించారు.
చేతికి కట్టుతో...
అనంతరం చేతికి చిన్నకట్టుతో ఓ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన సలే... తాను, తన చిన్న కుమారుడు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు.
ఈ దుశ్చర్యకు బాధ్యులు ఎవరో ఇప్పటికీ తెలియలేదు. ఈ దాడి తమ పని కాదని తాలిబన్లు ప్రకటించారు.
భారత్ స్పందన
బాంబు దాడిని భారత్ ఖండించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఉగ్రవాదం నిర్మూలన, శాంతి స్థాపన కోసం అఫ్గానిస్థాన్‌కు పూర్తి అండగా ఉంటామంటూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చూడండి: ఆ నగరంలో తుపాకీ సంస్కృతికి 10 మంది బలి