9848022338.. ఈ నంబర్ ఎక్కడో విన్నట్టుంది కదా? ఓ సినిమాలో హీరో కోసం అభిమానులు ఈ నంబర్‌కు వరుసపెట్టి ఫోన్ చేసి కమేడియన్ను ఓ ఆట ఆడుకుంటారు. అయితే ఉన్నట్టుండి దీని గురించి ఎందుకు అనుకుంటున్నారా? అమెరికాలో ఇదే సీన్ రిపీట్ అయింది. ట్రంప్ అభిమానులు, మద్దతుదారులు ఓ వ్యక్తికి ఫోన్ చేసి ఒక ఆట ఆడుకున్నారు.
అసలేమైందంటే..
మిషిగన్ రాష్ట్రానికి చెందిన రోజ్‌కు ఆదివారం ఓ కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చింది. "మీరు ఎలాగైనా ట్రంప్‌ను గెలిపించాలి.. ప్లీజ్" అని ఎవరో చెప్తున్నారు. ఆశ్చర్యపోయిన రోజ్.. "మీరు ఎవరనుకుని కాల్ చేశారో.. రాంగ్ నంబర్" అన్నారు. అయితే నిమిషాల్లోనే అలా కొన్ని వందల ఫోన్లు వచ్చాయి. అందరిదీ ఇదే మాట. "ట్రంప్‌కు మీరు మద్దతు ఇవ్వండి", "బైడెన్ ఎన్నికను చట్ట విరుద్ధమని ప్రకటించండి".. ఇలా ఏదేదో మాట్లాడుతున్నారు.
ఎంతమందికని చెప్తారు.. ఏమని చెప్తారు.. రోజ్ బాధ వర్ణనాతీతం. నిల్చుంటే ఫోన్, కూర్చుంటే ఫోన్.. సోమవారం కూడా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది.
"అమెరికాలోని ప్రతి రాష్ట్రం నుంచి నాకు ఫోన్ వచ్చింది. నా బాధ ఏమని చెప్పను? నేను మీరనుకున్న వ్యక్తిని కాను అని చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. వాళ్లు నాతో వాదిస్తున్నారు. ఒకరు నాకు మూడు సార్లు ఫోన్ చేశారు. ప్రశాంతంగా సమాధానమిచ్చా.. అయినా వినడం లేదు."
- ఓ టీవీ ఛానల్ ఇంటర్వూలో రోజ్
ఎందుకిలా..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార కమిటీ.. ఫేస్బుక్ పేజీలో చేసిన ఓ పొరపాటే ఇందుకు కారణం. అధ్యక్ష ఎన్నికల్లో మిషిగన్ రాష్ట్రంలో జో బైడెన్ విజయం సాధించిన విషయం అందరికీ తెలుసు. అయితే "రాష్ట్రంలో బైడెన్ ఎన్నికను రద్దు చేయాలని మీరు డిమాండ్ చేయండి" అంటూ ట్రంప్ ప్రచార కమిటీ ఫేస్బుక్ పేజీలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో రిపబ్లికన్ నేత ఛాట్‌ఫీల్డ్, సెనేట్ మెజారిటీ నేత లీ షిర్కీ మెయిల్, ఫోన్ నంబర్లు ఉన్నాయి. అయితే అందులో ఛాట్‌ఫీల్డ్ నంబర్ తప్పుగా ఉంది. ఆ నంబర్ అదే రాష్ట్రానికి చెందిన రోజ్‌ది అన్న మాట. ఇంకేముంది.. ట్రంప్ అభిమానుల దెబ్బకు రోజ్ పనైపోయింది.
ఇది తెలుసుకున్న రోజ్.. ఈ విషయాన్ని ట్రంప్ ప్రచార కమిటీకి చెప్పాలనుకున్నారు. అయితే దాన్ని కూడా ట్రంప్ అభిమానులు ఓ నాటకమని.. అది ఛాట్‌ఫీల్డ్ నంబరే అని పోస్ట్‌లు పెడుతున్నారు.
- ఇదీ చూడండి: పదవి కోసం ఎంతకైనా పోరాడతా: ట్రంప్