Worldwide corona update: అంతర్జాతీయంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా వివిధ దేశాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 22,17,682 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ కారణంగా ఐదు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆరు లక్షల మందికిపైగా కొవిడ్ నుంచి బయటపడ్డారు. వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రపంచ దేశాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కొవిడ్ కేసులు విపరీతంగా వెలుగుచూస్తున్నాయి.
- అమెరికాలో గడిచిన రెండు మూడు రోజులతో పోల్చుకుంటే రోజువారి కేసుల్లో భారీగా తగ్గుదల కనిపించింది. శనివారం 4.68 లక్షల మందికి వైరస్ సోకగా.. 669 మంది చనిపోయారు.
- ఫ్రాన్స్‌లో కొత్తగా మూడు లక్షలకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరో 142 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో తాజాగా 1 లక్షల 46 వేల మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 313 మంది మృతి చెందారు.
- రష్యాలో కొవిడ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నప్పటికీ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా 16,568 కేసులు నమోదవగా.. 796 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో తాజాగా 1,97,552 మంది కరోనా సోకింది. 184 చనిపోయారు.
- అర్జెంటీనాలో ఒక్కరోజే 1,01,689 కేసులు వెలుగుచాశాయి.37 మంది చనిపోయారు.
ఐసోలేషన్‌కు నేపాల్ ప్రధాని
నేపాల్ ప్రముఖ రాజకీయ నేత పుష్పకమల్ దహల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబా ఐసోలేషన్లోకి వెళ్లారు. కాగా ఆ దేశంలో శనివారం 944 మందికి వైరస్ సోకింది.
ఆస్ట్రేలియా మాజీ ప్రధానికి కొవిడ్
ఆస్ట్రేలియాలోనూ కరోనా విలయం సృష్టిస్తోంది. ఆ దేశ మాజీ ప్రధాని మాల్కం టర్న్‌బుల్ కూడా కొవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆ దేశంలో ఒక్కరోజే లక్షా 15 వేల మందికి కొవిడ్ సోకగా.. 25 మంది చనిపోయారు. వాస్తవంగా ఈ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రొమేనియాలో కఠిన ఆంక్షలు
మరో కొవిడ్ వేవ్ రాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది రొమేనియా సర్కారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. గడిచిన వారం రోజులుగా రోజువారి కేసులు 6000కుపైగా నమోదవుతున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు ఉపక్రమించారు అక్కడి అధికారులు.
'కఠిన చర్యలు అమలు చేయండి'
ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్ర రూపం దాల్చిన తరుణంలో.. ప్రజారోగ్య, సామాజిక చర్యలను కఠినంగా అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పిలుపునిచ్చింది. అలాగే ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉందని.. తేలికపాటిదేనని కొట్టిపారేయడానికి లేదని హెచ్చరించింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇదీ చదవండి: ఒమిక్రాన్ వేళ.. అక్కడ ఐదేళ్లలోపు పిల్లల్లో భారీగా ఆసుపత్రి చేరికలు