అమెరికాలోని మేరీల్యాండ్‌లో శనివారం కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరొకరికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపినట్లుగా భావించిన అనుమానితుడిని పోలీసులు అక్కడిక్కడే కాల్చేసినట్లు తెలుస్తోంది. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. చనిపోయినవారి ఆచూకీ తెలియకపోగా.. నిందితుడి వివరాలను కూడా ఇంకా గుర్తించలేదని వివరించారు.
సౌత్ ఫ్లోరిడా మాల్లో కాల్పులు
అమెరికాలోని సౌత్ ఫ్లోరిడాలోని ఓ మాల్లో రెండు సమూహాల మధ్య గొడవ కాల్పులకు దారి తీసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు దూషణకు దిగారని.. ఆపై కాల్పులు జరిగాయని అవెన్చురా పోలీసులు తెలిపారు. పారిపోతున్న వారిని మాల్ సిబ్బంది పట్టుకున్నట్లు తెలిపారు.
టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు
అమెరికా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్‌లో శనివారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారితో సహా ముగ్గురుపై కాల్పులు జరిపారు దుండగులు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. న్యూయార్క్‌లో వరుస కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎన్‌వైపీడీ కమిషనర్ డెర్మోట్ షియా తెలిపారు.
ఇదీ చూడండి: కేన్సర్‌తో 'బో' మృతి- ఒబామా భావోద్వేగం