కరోనా ప్రభావం పెద్దల్లో కంటే పిల్లల్లో తక్కువగా ఉండడానికి కారణం గుర్తించారు పరిశోధకులు. మానవ శరీరంలోకి వైరస్ ప్రవేశించడానికి సహకరించే ఏసీఈ2 జన్యువులు... పెద్దల్లో కంటే పిల్లల్లో తక్కువగా ఉంటాయని తేల్చారు. అందువల్లే పిల్లలు వైరస్ బారిన పడే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు.
మానవ శరీరంలోకి వైరస్ ప్రవేశించడానికి ఏసీఈ2 జన్యువులను బయోమార్కర్‌గా ఉపయోగించుకుంటుందని అమెరికాలోని ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పలు అంశాలను జామా(జేఏఎంఏ) జర్నల్‌లో ప్రచురించారు.
వయసుతో పాటు..
న్యూయార్క్‌లోని మౌంట్ సనాయ్ హెల్త్ సిస్టమ్‌లో నాలుగేళ్ల నుంచి 60 ఏళ్లు కలిగిన 305 మంది రోగులపై పరిశోధన చేసినట్లు తెలిపారు నిపుణులు. దీని ప్రకారం పిల్లల్లో నాసికా ఎథీలియంలో ఏసీఈ2 జన్యు వ్యక్తీకరణ తక్కువగా ఉంటుందని... వయసుతో పాటు ఇది పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. అయితే శరీరంలోకి వైరస్ ప్రవేశించడానికి ఏసీఈ2ను ఏ స్థాయిలో ఉపయోగించుకుంటుందో తెలుసుకోవడానికి లోతైన అధ్యయనం అవసరమని అన్నారు.
ఇదీ చూడండి: చైనా రక్షణ బడ్జెట్ పెంపునకు కరోనా బ్రేక్!