అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాటిక్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి సహకరించేది లేదని శ్వేతసౌధం ప్రకటించింది. సాక్షుల పేర్లను ఇప్పటికీ ప్రస్తావించలేదని.. కనుక బుధవారం జరగబోయే విచారణకు హాజరుకాబోమని ట్రంప్ న్యాయవాది పాట్ సిపోల్లోనె స్పష్టం చేశారు. ఈ మేరకు డెమొక్రటిక్ జుడీషియరీ కమిటీ ఛైర్మన్ జెర్రీ నాడ్లర్కు లేఖ రాశారు.
బుధవారం తేలుతుంది..
ప్రాథమిక విచారణలో సేకరించిన ఆధారాలు... రాజ్యాంగ అభిశంసన స్థాయిలో ఉన్నాయా లేదా? అనే విషయాన్ని జుడీషియరీ కమిటీ బుధవారం తేల్చనుంది. దేశద్రోహం, అవినీతి, తీవ్ర నేరాలు, దుర్మార్గాలు వంటి విషయాల్లో దేశాధ్యక్షుడి పాత్ర ఉంది అని రుజువైతే ఆయన్ను అభిశంసించే హక్కును రాజ్యాంగం కల్పించింది.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థిగా పోటీ చేస్తోన్న జో బిడెన్‌పై బురద జల్లేందుకు ట్రంప్ ప్రయత్నించారని విమర్శలు ఉన్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారని ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఉక్రెయిన్-బిడెన్ వ్యవహారంలో ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అమెరికన్ ప్రతినిథుల సభ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియకు సిద్ధమైంది. అయితే, అభిశంసన ప్రక్రియలో పాల్గొనేందుకు అధికార యంత్రాంగానికి అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని డెమొక్రాట్లకు రాసిన లేఖలో శ్వేతసౌధం స్పష్టం చేసింది.
- ఇదీ చూడండి: ఇండో-శ్రీలంక బంధం: పాత చెలిమికి కొత్త పాదు..!