2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందంటూ పెద్ద దుమారం చెలరేగింది. ఇందుకోసం ఫేస్‌బుక్‌ను వాడారని ఆరోపణలు వచ్చాయి. ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం తస్కరించినట్లు సంస్థ ఒప్పుకుంది. ఇప్పుడు ఫేస్బుక్ అనుంబంధ సంస్థ వాట్సాప్ ఇలాంటి చిక్కుల్లోనే పడింది. ఓ అధునాతన స్పైవేర్‌ను వాట్సాప్ ద్వారా పంపి చరవాణిల నుంచి వ్యక్తిగత సమాచారం దొంగలించేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఈ దాడి గురించి మొదటిగా 'ఫినాన్షియల్ టైమ్స్' వార్త ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది వరకు వినియోగిస్తోన్న వాట్సాప్ ద్వారా హ్యాకర్లు ఓ ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ను చరవాణిలకు పంపిస్తునట్లు వెల్లడించింది. ఈ స్పైవేర్‌ను ఇజ్రాయల్‌కు చెందిన ఓ సంస్థ తయారు చేసినట్లు తెలిపింది.
ఈ స్పైవేర్ ఆండ్రాయిడ్‌తో పాటు ఆపిల్ ఐ ఫోన్లపై ప్రభావం చూపనుందట. ఈ విషయాన్ని మే నెల మొదట్లోనే వాట్సాప్ గుర్తించింది. ఇందుకోసమే 10 రోజుల్లో యాప్ అప్డేట్ను తీసుకువచ్చింది.
"వినియోగదారులందరూ వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలానే చరవాణి ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్ టూ డేట్‌గా ఉంచుకోండి. మొబైల్లోని సమాచారాన్ని తస్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారి నుంచి తప్పించుకోవడానికే ఈ సూచన."
-వాట్సాప్ ప్రతినిధి
ఎంతమంది వినియోగదారులపై ఈ ప్రభావం ఉంది, ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారనే విషయంపై స్పష్టత లేదని వాట్సాప్ తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి తెలియజేసినట్లు పేర్కొంది. అయితే కొంతమంది, వినియోగదారులపై మాత్రమే ఈ ప్రభావం ఉండొచ్చని అంచనా వేసింది. ఈ పనిచేస్తోంది ఓ ప్రైవేటు సంస్థని తెలిపింది. ఈ సంస్థ ప్రపంచంలోని పలు ప్రభుత్వాలతో పని చేస్తున్నట్లు పేర్కొంది వాట్సాప్. సంస్థ పేరు ప్రకటించలేదు.
'యూనివర్సిటీ ఆఫ్ టొరోన్టో'లోని ఓ పరిశోధన విభాగం ఇటీవలే ఓ మానవహక్కుల సంఘానికి చెందిన న్యాయవాదిపై ఈ స్పైవేర్‌ను ప్రయోగించారని ట్వీట్ చేసింది. వాట్సాప్ వెనువెంటనే స్పైవేర్‌ను అడ్డగించినట్లు తెలిపింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు, యాప్ దుర్వినియోగం అవుతున్నట్లు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని వాట్సాప్ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: మీ ఐఫోన్ 'లొకేషన్ డేటా' భద్రమేనా?